వాట్సప్‌ అడ్మిన్‌లకు హెచ్చరిక

Are You A Whatsapp Admin Better To Be Careful - Sakshi

వాట్సప్‌ అడ్మిన్‌.. ఆదమరిస్తే అరెస్టే!

వాట్సప్‌ గ్రూపులపై పోలీసుల డేగకన్ను

వదంతులు వ్యాపింపజేస్తే బాధ్యులపై చర్యలు 

గ్రూప్‌ అడ్మిన్స్‌పై సైతం కేసులు 

సాక్షి, సిటీబ్యూరో : వాట్సప్‌లో ఏదో ఓ గ్రూప్‌ క్రియేట్‌ చేసో, సభ్యుల కోరిక మేరకో, ‘బాధ్యతలు’ అప్పగించడంతోనో అడ్మిన్‌గా మారారా? జర జాగ్రత్త çసుమా.! ఏమాత్రం తేడా వచ్చినా కటకటాల్లోకి వెళ్లాల్సిందే. ఆ గ్రూప్‌లో సర్క్యులేట్‌ అయ్యే అభ్యంతరకర సందేశాలు, వీడియోలకు మీరే పూర్తి బాధ్యులవుతారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రాజ్యమేలుతున్న వదంతుల నేపథ్యంలో ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఇలాంటి గ్రూపులకు అడ్మిన్లుగా ఉన్నవారూ బాధ్యులుగా మారతారని, వారిపైనా చర్యలు తప్పవని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ హెచ్చరించారు.

ఇప్పటి వరకు సరదాకు, సమాచార మార్పిడికి, యోగక్షేమాలు కనుక్కోవడానికి పరిమితమైన సోషల్‌ మీడియా ఒక్కసారిగా వివాదాస్పదమైంది. పక్షం రోజులుగా దీని కేంద్రంగా సాగుతున్న కిడ్నాపింగ్‌ గ్యాంగ్స్, దోపిడీ ముఠాల పుకార్లే ఇందుకు కారణం. వీటి కారణంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం, చేతులు దాటుతుండటంతో పోలీసు విభాగం నిఘా ముమ్మరం చేసింది. సోషల్‌ మీడియాలో ఎన్నో రకాలున్నా వాట్సప్‌ ఓ ప్రభంజనంలా మారింది. యూజర్‌ ఫ్రెండ్లీ కావడంతో అత్యధికులు దీన్నే వినియోగిస్తున్నారు. కేవలం సంక్షిప్త సందేశాలు మాత్రమే కాకుండా నిర్ణీత ప్రమాణంలో ఉన్న వీడియోలు, ఆడియోలు సైతం పోస్ట్‌/షేర్‌ చేసుకునే అవకాశం దీనిలో ఉంది. అత్యధికులు వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ యాప్‌ అత్యంత కీలకంగా మారిపోయింది.

ఎక్కడికక్కడ గ్రూపులు ఏర్పాటు... 
వాట్సప్‌ వినియోగదారులతో పాటు గ్రూపుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. ఒకే సందేశం/వీడియో/ఆడియోలను ఒకేసారి అనేక మందికి పంపడానికి, పరస్పర భావ మార్పిడికి ఎవరికి వారు వీటిని క్రియేట్‌ చేస్తున్నారు. స్నేహితులు, ఒకే ప్రాంతానికి చెందిన వారు, భావసారూప్యత ఉన్నవాళ్లు... ఇలా ఎవరికి వారు వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోపక్క పరిపాలనా సౌలభ్యం, త్వరితగతిన సమాచార మార్పిడి కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలూ వాట్సప్‌ గ్రూపుల్ని క్రియేట్‌ చేస్తున్నాయి. వాట్సప్‌కు అడ్వాన్డŠస్‌ వెర్షన్‌ అయిన వాట్సప్‌ వెబ్‌ వచ్చిన తర్వాత వీటి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అధికారిక కార్యకలాపాల కోసం ఏర్పాటవుతున్న గ్రూపులతో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా... ప్రైవేట్‌ గ్రూపులతోనే ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి.  

అత్యంత కీలకంగా అడ్మిన్‌... 
వాట్సప్‌లో ఏదైనా గ్రూప్‌ను క్రియేట్‌ చేయడం అనేది ఒకరి చేతిలో ఉంటుంది. సదరు గ్రూప్‌నకు అడ్మిన్‌గా బాధ్యతలు స్వీకరించే ఆ వ్యక్తి తన కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వారిలో ఎంపిక చేసుకున్న సభ్యులతో దీన్ని ఏర్పాటు చేస్తాడు. అవసరం, తనకు నమ్మకం ఉన్న, సత్సంబంధాలను బట్టి ఆ సభ్యుల్లో కొందరిని అడ్మిన్స్‌గా చేస్తూ యాడింగ్, రిమూవింగ్‌ అధికారాలు కల్పిస్తాడు. ఇలాంటి అడ్మిన్స్‌లో ఎవరైతే తొలుత గ్రూప్‌ను క్రియేట్‌ చేస్తారో (ప్రధాన అడ్మిన్‌)గా ఉండేవారే అత్యంత కీలకం. ఈ గ్రూపుల్లో కేవలం అడ్మిన్‌కు మాత్రమే కాకుండా అందులో ఉండే సభ్యులందరికీ షేరింగ్‌ చేసే సౌలభ్యం ఉంటుంది. దీనికి అడ్మిన్‌ అనుమతి, ప్రమేయం అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే చాటింగ్స్, పోస్టింగ్స్, షేరింగ్స్‌ అనేవి అడ్మిన్‌ అనుమతి, ప్రమేయం లేకుండానే సాగిపోతుంటాయి.  
 
కచ్చితంగా పర్యవేక్షణ ఉండాల్సిందే... 
ఓ వాట్సప్‌ గ్రూప్‌లో గరిష్టంగా 250 మంది సభ్యులు ఉన్నట్లే... ప్రతి సభ్యుడూ ఆ గ్రూప్‌తో పాటు మరికొన్నింటిలోనూ సభ్యుడిగా కొనసాగుతుంటాడు. ఫలితంగా ఓ గ్రూప్‌లో పోస్ట్‌ అయిన వీడియో క్షణాల్లో అనేక గ్రూపుల్లోకి వెళ్లిపోతుంది. పుకార్ల విషయంలో ఇలాంటి సదుపాయమే కొంపముంచుతోంది. ఈ నేపథ్యంలోనే సదరు గ్రూప్‌ అడ్మిన్‌ బాధ్యుడిగా మారతాడు. ఆ గ్రూప్‌లో జరుగుతున్న కార్యకలాపాలతో పాటు షేరింగ్‌ అవుతున్న అంశాలనూ అతడే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎవరైనా అభ్యంతరకర పోస్టింగ్స్, షేరింగ్స్‌ చేస్తుంటే వారిని రిమూవ్‌ చేయాల్సిన బాధ్యత కూడా అడ్మిన్‌కు ఉంటుంది. అలా కాని పక్షంలో గ్రూప్‌ వల్ల ఏదైనా జరిగితే అడ్మిన్‌ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాటిని పోస్ట్, షేర్, ఫార్వర్డ్‌ చేసిన సభ్యుడు సైతం చర్యలకు బాధ్యుడు అవుతాడు. ‘ఫార్వార్డెడ్‌ ఏజ్‌ రిసీవ్డ్‌’, ‘ప్లీజ్‌ క్రాస్‌ చెక్‌’ అంటూ నోట్‌ పెట్టినంత మాత్రాన ఎలాంటి మినహాయింపులూ ఉండవు. ఆ గ్రూపు సభ్యుడు లేదా ఇతరులెవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే బాధ్యుడితో పాటు అడ్మిన్‌ పైనా కేసు తప్పదు.

ఆధారాలు దొరికితే అరెస్టే...   
గడిచిన కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో... ప్రధానంగా వాట్సప్‌లో పుకార్లు పెరిగాయి. కిడ్నాపింగ్‌ ముఠాలు, దోపిడీ గ్యాంగులు వచ్చాయంటూ గ్రూపుల్లో ప్రచారం జరుగుతోంది. ఇది ఉద్రిక్తతలకు దారితీయడమే కాకుండా పరిస్థితులు చేతులు దాటేలా, అమాయకులు ఇబ్బందులు పాలయ్యేలా, ప్రజా జీవితానికి భంగం కలిగించేలా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రచారం చేయడం నేరం. ఇలాంటివి షేర్‌ చేసిన వారితో పాటు ఆయా గ్రూపుల అడ్మిన్లూ నేరం చేసినట్లే అవుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో సోషల్‌ మీడియాపై పూర్తి నిఘా ఉంచాం. బాధ్యుల్ని 24 గంటల్లోగా గుర్తించేస్తాం. సరైన ఆధారాలు చిక్కితే గ్రూప్‌ అడ్మిన్స్‌నూ అరెస్టులు చేస్తాం. 
– అంజనీకుమార్, నగర పోలీస్‌ కమిషనర్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top