అతడికి 64.. ఆమెకు 14

arab shieks marriage with minor girls in old city - Sakshi

సాక్షి, చాంద్రాయణగుట్ట:  అరబ్‌షేక్‌ల కామ దాహానికి అమాయక మైనర్‌ బాలికలు బలవుతున్నారు. బాలికల కుటుంబ ఆర్థికావసరాలను అవకాశంగా తీసుకొని కొందరు దుర్మార్గులు అరబ్‌షేక్‌లతో పెళ్లి జరిపిస్తున్నారు. తరువాత వారు పెట్టే హింసను భరించలేక.. వదలిరాలేక నరకం అనుభవిస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులే పడుతోంది పాతబస్తీకి చెందిన ఓ బాలిక. విషయం పోలీసులకు తెలియడంతో శుక్రవారం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.  డీసీపీ తెలిపిన మేరకు.. కామాటీపురా ప్రాంతానికి చెందిన సల్మాబేగం ఆర్థికావసరాలు గమనించిన బీపాషా బీ, రషేదా బీ, షాహిన్‌లు ఆమెను కలిశారు. ఆమె 14 ఏళ్ల కుమార్తెకు అరబ్‌ షేక్‌తో వివాహం జరిపిస్తే కష్టాలు తీరుతాయని నమ్మించి నాసర్‌ బిన్‌ మహమూద్, ఫతే బిన్‌ మహమూద్‌ల సహకారంతో అరబ్‌షేక్‌(64)తో 2014లో వివాహం జరిపించారు. తరువాత స్వదేశానికి వెళ్లిన షేక్‌  వీసా పంపాడు. ఆ వీసాతో బాలిక ఒమన్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తరువాత బాలికకు అసలు విషయంతెలిసింది. అతను ఫకీర్‌ అని తేలింది. చేసేది లేక రెండేళ్ల పాటు అక్కడే ఉంది. ఆరోగ్యసమస్యతో నగరానికి ఈ ఏడాది మార్చిలో వచ్చింది.

దీంతో సదరు షేక్‌ బాలికను వెంటనే రావాలని బెదిరించాడు.  బెదిరింపులు ఎక్కువ కావడంతో  సల్మాన్, సాజిద్‌ అనే ఇద్దరి సహాయంతో వర్క్‌ వీసాపై జూలైలో  దోహ ఖతర్‌ వెళ్లింది. ప్రస్తుతం అక్కడ కూడా ఆమె ఇంటి యజమాని చేతిలో నరకయాతన అనుభవిస్తోంది. చేసేది లేక బాలిక తల్లి కామాటీపురా పోలీసులను ఆశ్రయింయింది. దీంతో పోలీసులు దళారులైన బీపాషా బీ, రషెదా బీ, నాసర్‌ బిన్‌ మహమూద్, ఫతే బిన్‌ మహమూద్, సల్మాన్‌లను అరెస్ట్‌ చేశారు. కాజీ సిద్దిక్‌ అహ్మద్, దళారీ షాహిన్‌లు పరారీలో ఉన్నారు. బాలికను రప్పించేందుకు యత్నిస్తామని పోలీసులు తెలిపారు.  
మరో కేసులో.. యాకుత్‌పురాకు చెందిన కుల్సుం బేగాన్ని బహ్రేన్‌ దేశానికి చెందిన మహ్మద్‌ మహమూద్‌ అబ్దుల్‌ రహెమాన్‌ మహ్మద్, యూసుఫ్‌ మహ్మద్‌ అబ్దుల్‌ రహెమాన్‌ మహమూద్‌ ఖైరీ లు ఈ ఏడాది మే 24వ తేదీన కలిశారు. కుల్సుం బేగం రెండో కుమార్తె సమీనా బేగం (29)ను బహ్రేన్‌ దేశస్థులలో ఒకరైన మహమూద్‌ అబ్దుల్‌ రహెమాన్‌ మహ్మద్‌ కింగ్‌ కోఠిలో కాజీ అస్గర్‌ అలీ రఫాయి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం స్వదేశానికి తీసుకెళ్లాడు. కొన్నాళ్ల అనంతరం విడాకులు ఇవ్వకుండానే ఇంటికి పంపించేశాడు. దీంతోపోలీసులను బాధితురాలి తల్లి భవానీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మళ్లీ వారు వచ్చి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు   సిద్ధమవుతున్నారని తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.వారికి ఆశ్రయం     కల్పించిన గెస్ట్‌ హౌజ్‌ యజమానిని భవానీనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top