బలరాముడికి మరో ఆహ్వానం

Another Invitation To Balaram - Sakshi

ఎల్బ్రుస్‌ పర్వతం అధిరోహించడానికి ఇన్విటేషన్

ఇటీవలే కిలిమంజారో ఎక్కిన గిరిజన యువకుడు

వేధిస్తున్న ఆర్థిక సమస్య

కొడంగల్‌ రూరల్‌ వికారాబాద్‌ : ఇటీవల మార్చి 18వ తేదీన ఆఫ్రికా ఖండంలోని అతి ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి రికార్డు సాధించిన బలరాం రాథోడ్‌కు ప్రస్తుతం ఆగస్టు 8వ తేదీన రష్యా దేశంలోని అతి ఎత్తైన ఎల్బ్రుస్‌ పర్వతం అధిరోహించడానికి ఆహ్వానం అందిందని బలరాం రాథోడ్‌ తెలిపారు. బొంరాస్‌పేట మండలం చిల్‌ముల్‌ మైలారం అనుబంధ గ్రామం సత్తార్‌కుంట తాండాకు చెందిన బలరాం రాథోడ్‌ 2017 నవంబర్‌ 16 నుండి డిశంబర్‌ 5వ తేదీ వరకు హిమాలయ మౌంటెన్‌ డార్జిలింగ్‌లో సముద్ర మట్టం నుండి 16,600 అడుగుల ఎత్తులోని రేణాక్‌ పర్వతం అధిరోహించి ‘ఏ’ గ్రేడ్‌ సర్టిఫెట్‌ అందుకున్నాడు.

డిగ్రీ బీఎస్‌సీ (బీజెడ్‌సీ) పూర్తి చేసుకున్న బలరాం రాథోడ్‌ గతంలో రన్నింగ్‌లో రాష్ట్ర స్థాయిలో బహుమతులు గెలుచుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ‘ఏ’ (ఆల్‌ఫా) గ్రేడ్‌ సర్టిఫికెట్‌ పొందిన బలరాం రాథోడ్‌ ప్రపంచంలోని ఏ పర్వతమైనా అధిరోహించేందుకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో మార్చి 18వ తేదీన సౌత్‌ ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం అధిరోహించి రికార్డును సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం ఆగస్టు 8వ తేదీ నుండి రష్యాలోని ఎల్బ్రుస్‌ పర్వతాన్ని అధిరోహించడానికి ఆహ్వానం అందిందని ఆయన తెలిపారు. ఈ నెల 27వ తేదీన భువనగిరిలో రాక్‌ క్లైంబింగ్‌ సెలక్షన్స్‌ నిర్వహించారని అందులో తనతోపాటు మరో 5 మందిని సెలక్ట్‌ చేశారని తెలిపారు. ప్రస్తుతం భవనగిరిలో కోచ్‌ మాస్టర్‌ శేఖర్, మాస్టర్‌ పరమేష్‌కుమార్‌ల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటూ కొత్త వారికి శిక్షణ అందిస్తున్నానని తెలిపారు. 

ఇప్పటివరకు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో దాదాపు రూ.4 లక్షలకుపైగా ఖర్చు చేసుకుంటూ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించానని, ప్రస్తుతం దాతలు సహాయం చేసి రష్యాలోని ఎల్బ్రుస్‌ పర్వతాన్ని అధిరోహించేందుకు తోడ్పాటు అందించాలని కోరుతున్నారు. తల్లిదండ్రులు రూప్లానాయక్‌ మేస్త్రీ పనులు చేసుకుంటూ అన్న రమేష్‌ రాథోడ్‌ ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అవుతూ తనను ప్రోత్సహిస్తున్నారని, ఎల్బ్రుస్‌ పర్వతాన్ని ఎక్కడానికి దాతలు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని బలరాం రాథోడ్‌ కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top