రాష్ట్రంలో మరో 200 ఎంబీబీఎస్‌ సీట్లు

Another 200 MBBS seats in the state - Sakshi

వచ్చే ఏడాది ప్రారంభం కానున్న సిద్దిపేట ప్రభుత్వ వైద్య కాలేజీ

ఈ సీట్లన్నీ కన్వీనరు కోటాలోనే అందుబాటులోకి..

మే 10న ‘నీట్‌’నిర్వహించాలని నిర్ణయం! 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే ఏడాది వైద్య విద్య సీట్లు పెరగనున్నాయి. సిద్దిపేటలో ప్రభుత్వం నిర్మిస్తున్న వైద్య కాలేజీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. 200 ఎంబీబీఎస్‌ సీట్లకు అనుమతి వచ్చేలా ఈ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి భారత వైద్య మండలి (ఎంసీఐ) ఇప్పటికే ప్రాథమిక ప్రక్రియను పూర్తి చేసింది. త్వరలోనే అడ్మిషన్లపై అధికారిక ప్రకటన చేయనుంది.

ఇది ప్రభుత్వ కాలేజీ కావడంతో మొత్తం సీట్లను కన్వీనర్‌ (ఏ కేటగిరీ) కోటాలోనే భర్తీ చేస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,250 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ఇందులో ఆరు ప్రభుత్వ కాలేజీల్లో కలిపి 1,000 సీట్లు ఉన్నాయి. సిద్దిపేట కాలేజీతో కలిపి ఈ సంఖ్య 1,200కు పెరగనుంది. ఇక బీడీఎస్‌ కోర్సులో రాష్ట్రవ్యాప్తంగా 1,140 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక జాతీయ స్థాయి అర్హత పరీక్ష (నీట్‌) ఆధారంగా వైద్య విద్య అడ్మిషన్లు చేపడతారు. వచ్చే ఏడాది మే 10న నీట్‌ పరీక్ష నిర్వహించాలని సీబీఎస్‌ఈ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.

కన్వీనర్‌ కోటా పెంపు..
వైద్యవిద్య సీట్లపై ఉమ్మడి హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. వచ్చే ఏడాది సీట్ల భర్తీ స్వరూపం మారనుంది. మైనారిటీ అన్‌ఎయిడెడ్‌ కాలేజీల్లోని 60 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలోనే భర్తీ చేయనున్నారు. అయితే ఇంతకుముందు కూడా 60 శాతం కన్వీనర్‌కోటా ఉన్నా.. ప్రస్తుత విద్యా సంవత్సరం అడ్మిషన్లకు ముందు దీనిని 50 శాతానికి తగ్గించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

కానీ ఆ ఉత్తర్వులను కోర్టు కొట్టివేయడంతో తిరిగి 60 శాతం కన్వీనర్‌ కోటా అమలుకానుంది. మిగతా సీట్లలో 25 శాతం బీ కేటగిరీలో, 15 శాతం సీ కేటగిరీలో భర్తీ చేస్తారు. రాష్ట్రంలో మూడు మైనారిటీ వైద్య కాలేజీలు, ఒక దంత వైద్య కాలేజీకి కలిపి 500 సీట్లు ఉన్నాయి. వాటిల్లో ప్రస్తుత ఏడాది 250 సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేయగా.. వచ్చే ఏడాది అవి 300కు పెరుగుతాయి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top