
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు, మంచిర్యాల జిల్లా జన్నారం పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులుల గణన వేగంగా కొనసాగుతోంది. టైగర్ రిజర్వ్ ఫారెస్టులలో యేటా నిర్వహించే జంతుగణనలో భాగంగా ఈ ఏడాది కూడా జంతు గణన ప్రారంభమైంది. తొలి విడతగా పులులు, అనంతరం ఇతర జంతువులను లెక్కించనున్నారు. ఇందుకోసం అటవీ ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను బిగించారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ పర్యవేక్షణలో గణన కొనసాగుతోంది.
ముందుగా పులుల గణన
దేశవ్యాప్తంగా ఉన్న టైగర్ కారిడార్‌లలో ప్రతియేటా అటవీ శాఖ అధికారులు పులుల గణన చేపడతారు. అందులో భాగంగానే తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులలో పది రోజుల క్రితం గణన ప్రారంభమైం ది. ఇందుకు అడవిలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిలో నిక్షిప్తమైన గుర్తుల ప్రకారం వాటి సంఖ్యను లెక్కిస్తారు. పాదముద్రలు, విసర్జితాలు, ఇతర అవశేషాలను సైతం లెక్కలోకి తీసుకొని జంతువుల గణన చేపడతారు.
3,027.53 చ.కి.మీలలో అభయారణ్యం
నల్లమల అటవీ ప్రాంతం సుమారు 3,563 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా అందులో 3,027.53 చదరపు కిలోమీటర్లలో అభయారణ్యం ఉంది. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల అడవులను అమ్రాబాద్ పులుల అభయారణ్య ప్రాంతంగా పిలుస్తారు. ప్రస్తుతం అమ్రాబాద్ అభయారణ్యం పరిధిలో 150 రకాల జంతువులు, 60 రకాల పక్షులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అమ్రాబాద్ పులుల అభయారణ్యాన్ని రెండు బ్లాక్‌లుగా విభజించి గణన చేపట్టారు. మన్ననూర్, దోమలపెంట రేంజ్‌ను మొదటి బ్లాక్‌గా, మద్దిమడుగు, అమ్రాబాద్ ప్రాంతాలను రెండో బ్లాక్‌గా విభజించారు.
బ్లాక్–1లో 100 కెమెరాలు, బ్లాక్–2 లో 117 సీసీ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పదిరోజులుగా కెమెరా ల్లో నిక్షిప్తమైన అటవీ జంతువుల వివరాలను అటవీ శాఖ సిబ్బంది పరిశీలిస్తున్నారు. 134 మంది సిబ్బంది 700 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో తిరుగు తూ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ముందుగా నెలరోజుల పాటు పులుల గణన చేపట్టనున్నారు. గతేడాది లెక్కల ప్రకారం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలో 20 పెద్దపులులు ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా.
కవ్వాల్‌లో..
కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని కాగజ్‌నగర్, బెల్లపల్లి డివిజన్‌లలో అటవీ ప్రాంతంలో 120 చోట్ల 240 కెమెరాలను అమర్చారు. జన్నారం, చెన్నూర్ డివిజన్లలోనూ లెక్కింపు కొనసాగుతోంది. చెన్నూర్‌లో 3, జన్నారంలో ఒకటి, కాగజ్‌నగర్‌లో 5 వరకు పులులు ఉన్నట్లు తెలిసింది. గణన అనంతరం పులుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.
గణన కొనసాగుతోంది
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని వన్యప్రాణుల గణనకు ఏర్పాట్లు చేశాం. అటవీశాఖ పర్యవేక్షణలో హిట్‌కాస్ సంస్థ ఎన్‌జీవో సభ్యులు కూడా గణనలో పాల్గొంటున్నారు.– జోజి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్
సీసీ ట్రాప్ కెమెరాలతో పరిశీలిస్తున్నాం
అమ్రాబాద్ అభయారణ్యంలో బిగించిన సీసీ ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తులను పరిశీలించి పులుల లెక్కింపు చేపడుతున్నాం. ఈ సారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పులులను లెక్కిస్తున్నాం.
– బాపురెడ్డి,రీసెర్చ్ ఆఫీసర్, ఎన్‌టీసీ, అమ్రాబాద్ ఇన్‌చార్జ్
నల్లమలలో 2018లో గుర్తించిన వన్యప్రాణుల సంఖ్య
పెద్ద పులులు: 20
చుక్కల దుప్పులు: 3,040
కణితి: 4,608
అడవి పందులు: 2,272
కొండ గొర్రెలు: 1,072
మనుబోతులు: 480
బుర్ర జింకలు: 1,888
కొండ ముచ్చులు: 11,600