హరితలోగిళ్లు.. ఈ అంగన్‌వాడీలు

Anganwadi Centres Turn Into Green In Birkur At Kamareddy - Sakshi

సాక్షి, బీర్కూర్‌ (కామారెడ్డి): తెలంగాణ వ్యాప్తంగా మొక్కల పెంపకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతీ ప్రభుత్వ శాఖను హరితహారంలో భాగం చేస్తు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే శాశ్వత అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ కేంద్రాలను అందమైన హరితలోగిళ్లుగా మార్చుతున్నారు. తమ కేంద్రాల ఆవరణలో అనేక రకాల పూల మొక్కలతో పాటు కూరగాయల మొక్కలు, ఆకు కూరల పాదులు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటి ద్వారా వచ్చిన కూరగాయలు, ఆకు కూరలను పౌష్టికాహారంలో భాగంగా గర్బవతులకు, బాలింతలకు, చిన్నారులకు మంచి ఆకుకూరలతో భోజనాన్ని వడ్డిస్తున్నారు.

ఎక్కువగా సొంత భవనాల్లోనే..
సొంత భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయా గ్రామాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తలు తమ కేంద్రాల పరిదిలో హరితవనాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. బీర్కూర్‌ మండలంలో మొత్తం 25 కేంద్రాలు ఉండగా వాటిలో 14 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు కార్యకర్తలు మొక్కలు నాటి వాటిని పోషించే బాధ్యతను స్వీకరించారు. బీర్కూర్‌ మండల కేంద్రంలోని హరిజనవాడ, కిష్టాపూర్,అన్నారం, దామరంచ, రైతునగర్‌ త దితర గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలో మొక్క లు పెంచుతున్నారు. బీర్కూర్‌ మండలంతో పాటు బాన్సువాడ ప్రాజెక్ట్‌ పరిధిలోని ఐదు మండలాల్లో మొత్తం 222 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 94 కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 1198 అంగన్‌వాడీ కేంద్రాలుండగా కొన్నే సొంత భవనాలు ఉన్నాయి.

బీర్కూర్‌ మండలంలో..
బీర్కూర్‌ మండలంతో పాటు బాన్సువాడ ప్రాజెక్ట్‌ పరిధిలో కొన్ని కేంద్రాలకు సొంత భవనాలు ఉండటంతో మొక్కల పెంపకం చేపట్టడం జరిగిందని అయితే అద్దె భవనాల్లో ఈ సదుపాయం లేకుండా పోతోందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే మరికొంత మంది మాత్రం సొంత భవనాలు ఉన్నప్పటికి మొక్కల పెంపకంపై ఆసక్తి కనబరచడం లేదు. బీర్కూర్‌ గ్రామంలోని హరిజనవాడ అంగన్‌వాడీ కేంద్రాల్లో అనేక రకాల పూల మొక్కలతో పాటు ఆకుకూరల పాదులను ఏర్పాటు చేసి సాగు చేస్తున్నారు.

ఆట పాటలతో విద్యాబోధన
కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు ఆట పాటలతో చిన్నారులకు విద్యాభోదన చేస్తున్నారు. దీంతో పాటు గర్భవతులకు, బాలింతలకు ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం మేరకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో కొంత మేర మార్పు కనిపిస్తోందని ఆయా గ్రామాల ప్రజలు అభిప్రాయపడ్తున్నారు.

పచ్చదనంతో నిండి ఉంటుంది..
బీర్కూర్‌ మండల కేంద్రంలోని హరిజనవాడలో అన్న అంగన్‌వాడీ కేంద్రం పచ్చదనంతో నిండి ఉంటుంది. అం గన్‌వాడీ కేంద్రానికి వస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. తమ పిల్లలు కేంద్రంలో చక్కగా భోజనం చేస్తూ ఆటలు ఆడుకుంటూ చదువు నేర్చుకుంటున్నారు. సొంత భవనం లేనప్పుడు పిల్లలు కూడా ఇబ్బందులు పడేవారు.
– కల్యాణి, బాలింతరాలు, బీర్కూర్‌

కొన్ని కేంద్రాలు ఎంతో బాగున్నాయి
బీర్కూర్‌ మండలంలో మొత్తం 25 కేంద్రాలకు గాను 14 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతూ కార్యకర్తలు కూరగాయ మొక్కలను సైతం పెంచు తున్నారు. దీనివల్ల గర్భవతులకు పౌష్టికాహారం అందించే సమయంలో వీటిని  ఉపయోగిస్తున్నారు.
– కళావతి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ బీర్కూర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top