విషాదం మిగిల్చిన విద్యుత్‌షాక్‌

Anganwadi Aaya Loss Hands And Legs in Current Shock Sangareddy - Sakshi

చేతులు, కాళ్లు కోల్పోయిన అంగన్‌వాడీ ఆయా

ఇన్‌ఫెక్షన్‌ పెరిగిపోవడంతో తొలగించక తప్పని పరిస్థితి

గజ్వేల్‌ ఆసుపత్రిలో ఆపరేషన్‌ విజయవంతం

అండగా నిలిచిన మంత్రి హరీశ్‌రావు

గజ్వేల్‌: విద్యుత్‌ షాక్‌ ఆమెకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. చేతులు, కాళ్లను కోల్పోవాల్సిన దయనీయ స్థితిని కల్పించింది. ఇన్‌ఫెక్షన్‌ పెరిగిపోవడంతో అవయవాలను తొలగించక తప్పని పరిస్థితి నెలకొన్నది. వివరాలిలా ఉన్నాయి... దౌల్తాబాద్‌ మండలం దొమ్మాట గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఆయా కరికె కళావతి జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబరాల్లో అపశృతి చోటు చేసుకొని విద్యుత్‌షాక్‌తో తీవ్రగాయాల పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్న కళావతిని హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించగా... సరైన వైద్యం అందించలేమని చేతులెత్తేయడంతో తిరిగి గజ్వేల్‌కు తెచ్చారు. గత వారం రోజులుగా ఆమె గజ్వేల్‌లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కళావతి దయనీయ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు ఈనెల 7న స్వయంగా ఆసుపత్రిని సందర్శించి కళావతి పరిస్థితిని పరిశీలించి చలించిపోయారు.

తక్షణ సాయం కింద రూ. 50వేలు అందించడమేగాకుండా ఆమెను కాపాడడానికి అవసరమైన శస్త్ర చికిత్సలు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మహేష్‌ను ఆదేశించారు. అంతేగాకుండా ఆమెకు జీవితకాలం ప్రభుత్వ వేతనం అందేలా చూస్తానని, ఆమె అవసరాల కోసం అవసరమైన నగదును కూడా వ్యక్తిగత ఖాతాలో జమచేస్తానని హామీ ఇచ్చిన సంగతి విధితమే. ఈ క్రమంలోనే బుధవారం కళావతి విద్యుత్‌షాక్‌కు గురైన చేతులు, కాళ్లలో రక్త ప్రసరణ అగిపోవడమేగాకుండా ఇన్‌ఫెక్షన్‌ పెరిగిపోయింది. దీని వల్ల ప్రాణానికే ప్రమాదమని గుర్తించిన వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఈ సందర్భంగా మోకాళ్ల కింది వరకు రెండు కాళ్లను, మోచేతి కిందికి ఎడమ చేయిని, మోచితిపైకి కుడి చెయ్యిని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మహేష్‌ తెలిపారు. ఈ అరుదైన శస్త్రచికిత్సలో ముగ్గురు ఆర్థోపెడిషియన్లు, ముగ్గురు మత్తు మందు డాక్టర్లు, ఒక సర్జన్, ఐదుగురు స్టాఫ్‌ నర్సులు, ఇద్దరు థియేటర్‌ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. కళావతికి జరిగిన శస్త్ర చికిత్స తన కేరీర్‌లోనే అరుదైనదిగా డాక్టర్‌ మహేష్‌ అభివర్ణించారు. మరో పదిహేను రోజుల పాటు ఇక్కడే కళావతి తమ పరిశీలనలో ఉంటుందని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top