ఓఆర్‌ఆర్‌ వెంట సకల సౌకర్యాలు

All facilities at outer ring roads - Sakshi

ఇంధన స్టేషన్లు, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు   పక్కా ప్రణాళిక సిద్ధం చేసిన హెచ్‌ఎండీఏ

సాక్షి, హైదరాబాద్‌: నగరానికే తలమానికమైన ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంట వాహనదారులకు సకల సౌకర్యాలు కల్పించే దిశగా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) దృష్టి సారించింది. ఈ రహదారిపై ఇంధన స్టేషన్లు, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ చార్జింగ్‌ స్టేషన్లు, మినీ ఆటోమొబైల్‌ వర్క్‌షాప్‌లు, ఫుడ్‌ కోర్టులతో పాటు ట్రామా కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న మంత్రి కేటీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది.

ఇందులో భాగంగానే 19 ఇంటర్‌ ఛేంజ్‌లున్న 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌లో పటాన్‌చెరు, మేడ్చల్, ఘట్‌కేసర్, పెద్ద అంబర్‌పేట, నార్సింగ్‌ ప్రాంతాల్లో ఈ సౌకర్యాలు తొలుత ఏర్పాటు చేస్తామని హెచ్‌ఎండీఏ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌కు ప్రతిపాదనలు పంపింది. ఆ తర్వాత మిగిలిన 14 ఇంటర్‌ ఛేంజ్‌ల వద్ద పనులు ప్రారంభిస్తామని అందులో పేర్కొంది.

భద్రతకు పెద్దపీట...
కండ్లకోయ జంక్షన్‌  పూర్తవడంతో కొన్నిరోజుల క్రితం సంపూర్ణ ఓఆర్‌ఆర్‌ వాహన చోదకులకు అందుబాటులోకి వచ్చింది. వీరి అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికితోడు ప్రయాణించే వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రమాదాలు కూడా అధికమవుతున్నాయి. 2012లో 204, 2013లో 200, 2014లో 139, 2015లో 686, 2016లో 828, 2017లో 812 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంది. ఈ నేపథ్యం లో క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం కోసం ట్రామాకేర్‌ సెంటర్లు ఏర్పాటుచేస్తే బాగుంటుందన్న మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు ఆ దిశగా హెచ్‌ఎండీఏ కమిషనర్‌ టి.చిరంజీవులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ట్రామా కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంరక్షణ విభాగ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి లేఖను కూడా రాశారు.

దీంతో పాటు అంబులెన్స్‌ల సంఖ్యను పది నుంచి 16కు పెంచాలని నిర్ణయించారు. అలాగే హెచ్‌టీఎంఎస్‌ వ్యవస్థతో ఓఆర్‌ఆర్‌ను అనుసంధానం చేయడం వల్ల ఎక్కడ ప్రమాదం జరిగినా ఇట్టే సమాచారం అందుకుని అంబులెన్స్‌ ఘటనాస్థలికి త్వరగా చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్‌ చిరంజీవులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top