భారత్‌కు ఉగ్రవాది జుబేర్‌

Al Qaeda Terrorist Mohammed Ibrahim Zubair Reached India - Sakshi

తల్లిదండ్రుల స్వస్థలం హైదరాబాద్‌

భారత పౌరుడైనా పుట్టి పెరిగింది అబుదాబిలోనే

అమెరికా పౌరసత్వం.. అల్‌కాయిదాకు అండ...  ఐదేళ్ల జైలు జీవితం 

సాక్షి, హైదరాబాద్‌: అల్‌కాయిదా ఉగ్రవాది, ఆ సంస్థకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించిన భారత సంతతి అమెరికన్‌ మహ్మద్‌ ఇబ్రహీం జుబేర్‌(40) భారత్‌ చేరుకున్నాడు. ఉగ్ర లింకులపై ఐదేళ్ల జైలు జీవితం అనుభవించిన ఇతడిని ‘వందే భారత్‌ మిషన్‌’లో భాగంగా వచ్చిన విమానంలో అమెరికా ప్రభుత్వం ఇక్కడికి పంపింది. ఈనెల 19న అమృత్‌సర్‌ చేరుకున్న ఇతడిని ఉగ్ర లింకులపై దర్యాప్తు అధికారులు విమానాశ్రయంలోనే ప్రశ్నించారు. అనంతరం అమృత్‌సర్‌ సమీపంలోని కోవిడ్‌ వైద్య కేంద్రానికి 14 రోజుల క్వారంటైన్‌ నిమిత్తం తరలించారు.

స్వస్థలం హైదరాబాద్‌..  
జుబేర్‌ తల్లిదండ్రుల స్వస్థలం హైదరాబాద్‌లోని టోలిచౌకి. ఈ కుటుంబం కొన్నేళ్ల క్రితమే అబుదాబిలో స్థిరపడింది. అక్కడే పుట్టిన జుబేర్‌కు అమలులో ఉన్న నిబంధనల ప్రకారం భారత పౌరసత్వం లభించింది. అబుదాబిలోనే చదువుకున్న జుబేర్‌ బీటెక్‌ చదవడానికి హైదరాబాద్‌కు వచ్చాడు. బంజారాహిల్స్‌ ప్రాంతంలో ఉంటూ అక్కడే ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేశాడు. ఉన్నత విద్య కోసం 2001లో అమెరికా వెళ్లిన జుబేర్‌ 2005 వరకు అక్కడి వర్సిటీ ఆఫ్‌ ఇలినాయిస్‌లో విద్యనభ్యసించాడు.

2006లో అమెరికా జాతీయురాలిని వివాహం చేసుకుని ఆ దేశ పౌరసత్వం పొందాడు. టెక్సాస్‌లోని టొలెడో ప్రాంతం లో నివసిస్తున్న ఇతడికి అల్‌కాయిదా కీలక నేత అన్వర్‌ అల్‌ ఔలాకీతో పరిచయం ఏర్పడింది. అతడి ద్వారా ఉగ్రవాద సంస్థకు నిధులు సమకూర్చే స్థాయికి ఎదిగాడు. జుబేర్‌ తన సోదరుడు యాహ్యా మహ్మద్‌ ఫారూఖ్‌నూ అదేబాట పట్టించాడు. వీరి వ్యవహారాలను గుర్తించిన ఎఫ్‌బీఐ 2015లో ఇద్దరినీ అరెస్టు చేసింది. ఈ కేసు విచారిస్తున్న జడ్జీని చంపేందుకు పథకం పన్నినట్లు తేలడంతో ఫారూఖ్‌కు అమెరికా కోర్టు ఇరవై ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది.

శిక్షాకాలం పూర్తవడంతో..  
జుబేర్‌  నేరం అంగీకరించడంతో (ప్లీడెడ్‌ గిల్టీ) ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షాకాలం గత వారంతో పూర్తయింది. జుబేర్‌ భారత పౌరుడు కావడంతో ఇక్కడికే పంపేయాలని అమెరికా నిర్ణయించింది. ఆ లాంఛనాలు పూర్తి చేసిన అమెరికా అధికారులు టెక్సాస్‌ నుంచి వందే భారత్‌ విమానంలో గురువారం ఢిల్లీకి పంపారు. నిబంధనల ప్రకారం అధికారులు 14 రోజుల క్వారంటైన్‌కోసం అమృత్‌సర్‌లోని కోవిడ్‌ కేంద్రానికి తరలించారు. అనంతరం ఢిల్లీకి తీసుకువెళ్ళి దర్యాప్తు విభాగాలు మళ్లీ విచారించనున్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాతే హైదరాబాద్‌కు పంపిస్తారని తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top