ఎయిర్‌పోర్టు మెట్రో ఎప్పుడో?

Airport Metro Project Soon in Hyderabad - Sakshi

ఏడాది క్రితం ఎక్స్‌ప్రెస్‌ మెట్రో నిర్మాణానికి డీపీఆర్‌ రెడీ

ఇప్పటికీ ముందుకు పడని అడుగు  

రూ.4500 కోట్లతో 30.7 కి.మీ మార్గంలో మెట్రో రెండోదశ

జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ రూట్‌లో ఈ వారంలో మెట్రో పరుగులు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ వాసుల కలల మెట్రో ప్రాజెక్ట్‌ను శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించేందుకు ఏడాది క్రితం సిద్ధం చేసిన సమగ్రప్రాజెక్ట్‌ నివేదిక కార్యరూపం దాల్చడం లేదు. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ వరకు సుమారు 30.7 కిలోమీటర్ల మార్గంలో దాదాపు రూ.4500 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని సంకల్పించారు. కానీ నిధుల లేమి శాపంగా పరిణమిస్తోంది. మెట్రో తొలిదశ తరహాలో పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్యం లేదా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణ సేకరణ జరిపి ఈ ప్రాజెక్ట్‌నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినా అడుగు ముందుకు పడకపోవడం గమనార్హం. 

ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఉద్దేశం ఇదే..
రాయదుర్గం నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతుంది. కానీ మెట్రో రైళ్లలో కేవలం25 నిమిషాల్లో విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్‌ మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు.
ఏడాది క్రితం ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌ అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలోకి రంగంలోకి దిగి శంషాబాద్‌ రాయదుర్గం మార్గంలో పర్యటించి ఈ డీపీఆర్‌నుసిద్ధంచేశారు.  ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉన్న మెట్రో కారిడార్లు విమానాశ్రయానికి కనెక్టివిటీలేకపోవడంతో..తక్షణం విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైన విషయం విదితమే. విమానాశ్రయమార్గంలో ప్రతీఐదు కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్‌ను ఏర్పాటుచేయాలని నివేదికలో పేర్కొన్నారు. స్టేషన్లను ఔటర్‌రింగ్‌ రోడ్డుకు సమీపంలోని గచ్చిబౌలి, అప్పా జంక్షన్,
కిస్మత్‌పూర్, గండిగూడా చౌరస్తా, శంషాబాద్‌ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో  ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

పీపీపీ విధానంలో ముందుకొచ్చేదెవరో...?
ప్రస్తుతం నాగోల్‌–రాయదుర్గం, ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఫలక్‌నుమా మార్గంలో మొదటిదశ మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టారు. మూడు మార్గాల్లో 72 కి.మీ ప్రాజెక్టు పూర్తికి సుమారు రూ.14 వేల కోట్ల అంచనా వ్యయం అవుతుందని తొలుత అంచనావేశారు. కానీ ఆస్తుల సేకరణ ఆలస్యం కావడం, అలైన్‌మెంట్‌ చిక్కులు, రైట్‌ఆఫ్‌వే సమస్యల కారణంగా మెట్రో అంచనా వ్యయం సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా పెరిగినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో రెండోదశ మెట్రో ప్రాజెక్టునుపీపీపీ విధానంలో చేపట్టేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందా అన్నది సస్పెన్స్‌గా మారింది. కాగారాయదుర్గం శంషాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌మెట్రో కారిడార్‌ ఏర్పాటుకు స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌(ప్రత్యేకయంత్రాంగం)ను ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయం విదితమే.
జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ రూట్‌లోఈ వారంలో మెట్రో పరుగులు
సికింద్రాబాద్‌–హైదరాబాద్‌ నగరాలను అనుసంధానం చేసే జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మెట్రో మార్గాన్ని ఈ వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ప్రారంభ కార్యక్రమాన్ని జేబీఎస్‌ వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. పది కిలోమీటర్ల నిడివి గల ఈ మార్గంలో తొమ్మిది మెట్రో స్టేషన్లున్నాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే తొలిదశ మెట్రో ప్రాజెక్టు సంపూర్ణం కానుండటం విశేషం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top