ఎయిడెడ్‌లో ప్రైవేటు దందా! 

Aided Colleges in the State have Started Private Privatization - Sakshi

ఎయిడెడ్‌ ఉన్నా ప్రైవేటు కాలేజీలుగా కొనసాగింపు

జూనియర్‌ కాలేజీలే కాదు..డిగ్రీ కాలేజీల్లోనూ అదే దందా

ఏకంగా 18 కాలేజీలకు అనుమతిచ్చేసిన కళాశాల విద్యాశాఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎయిడెడ్‌ కాలేజీల్లో ప్రైవేటు దందా మొదలైంది. ఇప్పటివరకు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల పేరుతో కొన్ని సెక్షన్లలోనే కొనసాగిన ప్రైవేటు దందా.. ఇప్పుడు ఏకంగా ఎయిడెడ్‌ కాలేజీలను పూర్తి ప్రైవేటు కాలేజీలుగా మార్చేందుకు తెర వెనుక అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ తతంగంలో 25 నుంచి 75 ఏళ్ల చరిత్ర గల ప్రముఖ కాలేజీలు కూడా ప్రైవేటుగా మారిపోతున్నాయి. ప్రభుత్వానికే తెలియకుండా పదుల సంఖ్యలో ఇంటర్మీడియట్, డిగ్రీ ఎయిడెడ్‌ కాలేజీలు ప్రైవేటు కాలేజీలుగా ఆయా శాఖలే మార్చేశాయి. ఏళ్ల చరిత్ర గల వరంగల్‌లోని ఓ ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాల ఆవరణలోనే కొత్త యాజమాన్యం పేరుతో ప్రైవేటు కాలేజీగా బోర్డు పెట్టారు. హైదరాబాద్‌ నగరం, ఇతర జిల్లాల్లోని రూ. వేల కోట్ల ఆస్తులు గల ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలను ప్రైవేటు కాలేజీలుగా కొనసాగించేందుకు కళాశాల విద్యా శాఖ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఇలా 18 కాలేజీలను కళాశాల విద్యాశాఖ ప్రైవేటుగా మార్చేసినట్లు సమాచారం.  

నియామకాలు చేపట్టకే.. 
ప్రభుత్వం నియామకాలను చేపట్టకపోవడంతో ఉన్న సిబ్బందితోనే ఎయిడెడ్‌ కాలేజీలను నడిపిస్తున్నారు. మరోపక్క ప్రైవేటు లెక్చరర్లను నియమించుకొని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి భారీగా ఫీజులను వసూలు చేస్తున్నారు. మరికొన్ని యాజమాన్యాలు రూ. వేల కోట్ల ఆస్తులు, భూములు, భవనాలు గల ఆయా విద్యా సంస్థల ఆస్తులపై కన్నేశాయి. వీరంతా సరిపడా లెక్చరర్లు లేరన్న సాకుతో కాలేజీలను నడపలేమంటూ వాటిని మూసేసి ఆస్తులను కొట్టేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయా యాజమాన్యాలు కళాశాల విద్యాశాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలోని 18 ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లోని లెక్చరర్లు, సిబ్బందిని ప్రభుత్వ కాలేజీల్లో అవసరం ఉందంటూ వాటిల్లోకి బదిలీ చేసి, అక్కడ ఎయిడెడ్‌ కాలేజీ అనేది లేకుండా చేసినట్లు సమాచారం. కొన్ని కాలేజీలు మాత్రం ప్రైవేటు కాలేజీలుగా కొనసాగిం చేందుకు సిద్ధం కాగా, మరికొన్ని పూర్తిగా మూతవేసి ఆస్తులను కొట్టేసే యోచనల్లో ఉన్నట్లు తెలిసింది. 

ప్రభుత్వం సీరియస్‌.. 
ఈ తతంగం మొత్తం ప్రభుత్వానికి తెలియడంతో సీరియస్‌ అయ్యింది. ప్రస్తుతం కళాశాల విద్యాశాఖ ఎయిడెడ్‌ నుంచి ప్రైవేటుగా మార్చుతూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లోని 5 ఇంజనీరింగ్‌ కాలేజీలను నగర పరిసరాల్లోకి మార్చుకునేందుకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సదరు కాలేజీలు అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై సీరియస్‌ అయిన ప్రభుత్వం ఆ షిఫ్టింగ్‌లను రద్దు చేయాలని, ఏఐసీటీఈకీ లేఖ రాయాలని సూచించినా సాంకేతిక విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని తెలిసింది. దీంతో వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం కాలేజీలను షిఫ్టింగ్‌ చేసేలా సాంకేతిక విద్యాశాఖకు ఉన్న అధికారాలను రద్దు చేసినట్లు సమాచారం. ఎయిడెడ్‌ కాలేజీలను ప్రైవేటు కాలేజీలుగా మార్చాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఎలా మార్పు చేశారన్న దానిపై నివేదిక కోరినట్లు తెలిసింది. 

ఆస్తులపై దాతల వారసుల కన్ను.. 
ఒకప్పుడు దాతలు విద్యాదానం చేసేందుకు ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ దాతల వారసులే కొంతమంది ఎయిడెడ్‌ ఆస్తులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కళాశాల విద్యాశాఖ అధికారులతో కుమ్మక్కయి ఆయా కాలేజీల్లోని లెక్చరర్లు, సిబ్బందిని ముందుగా ప్రభుత్వ కాలేజీల్లోకి పంపించి, చివరకు ఎయిడెడ్‌ అనేది లేకుండా చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో నగదు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top