నగరంలో మళ్లీ కుండపోత

Again huge rain in the city - Sakshi

పలు ప్రాంతాలను ముంచెత్తిన వాన 

మీరాలంలో 7.1 సెం.మీ. వర్షపాతం 

వెంటాడుతున్న క్యుములోనింబస్‌ మేఘాలు 

మరో 24 గంటలు ఇదే పరిస్థితి 

రెండు రాష్ట్రాలకూ  భారీ వర్ష సూచన

సాక్షి, హైదరాబాద్‌: క్యుములోనింబస్‌ మేఘాలు రాజధానిని వెంటాడుతూనే ఉన్నాయి. శనివారం కూడా భారీ వర్షంలో నగరం తడిసి ముద్దయింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో ఇళ్లు, కాలనీలు, బస్తీల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇటీవలి 13 సెం.మీ. భారీ వర్షం దెబ్బ నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ వచ్చి పడ్డ వర్షంతో వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది.

శనివారం రాత్రి తొమ్మిదింటి వరకు మీరాలంలో 7.1 సెంటీమీటర్లు, ఆసిఫ్‌నగర్‌లో 5.05, సర్దార్‌మహల్‌లో 4.05, రాజేంద్రనగర్‌లో 3.28, గోల్కొండ, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో 2.5, సైదాబాద్, సికింద్రాబాద్, అంబర్‌పేట్, అమీర్‌పేట్, షేక్‌పేట్‌ తదితర చోట్ల 1 సెం.మీ. వర్షం కురిసింది. ఉప్పల్, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, కుషాయీగూడ, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కరెంట్‌ పోయి జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అటు వరదనీరు, ఇటు కటిక చీకటితో అల్లాడారు. 

మరో 24 గంటల పాటు..
మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల మరో 24 గంటల పాటు నగరంలో భారీ వర్షం కురవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడనున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలుంటాయని అధికారులు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top