రక్షణ కల్పిస్తేనే అడవుల్లోకి..

After providing protection only to the the forest - Sakshi

పీసీసీఎఫ్‌ పీకే ఝాకు అటవీ అధికారుల సంఘాల విజ్ఞప్తి

అడవుల్లో స్థానిక రాజకీయ జోక్యం పెరిగిపోతోందని ఆవేదన

ఆత్మరక్షణకు ఆయుధాలివ్వాలంటూ వినతి..

అడవుల్లోని పరిస్థితులపై ప్రభుత్వానికి పీకే ఝా నివేదిక  

సాక్షి, హైదరాబాద్‌: ‘మాకు రక్షణ ఏర్పాట్లు చేయకపోతే అడవుల్లోకి వెళ్లలేం. మాపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అడవుల సంరక్షణ బాధ్యతలు చేపట్టలేం. అడవుల్లో స్థానికంగా రాజకీయ జోక్యం పెరుగుతోంది. పోలీసు, రెవెన్యూ శాఖలు సహకరించడం లేదు. మమ్మల్ని మేము రక్షించుకునేందుకు అధికారులు, సిబ్బంది వద్ద ఆయుధాలు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా రక్షణకు ప్రభుత్వపరంగా స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఇకముందు విధుల నిర్వహణ కష్టమవుతుంది..’అని రాష్ట్ర ప్రభుత్వానికి ఐఎఫ్‌ఎస్‌ స్థాయి మొదలుకుని వివిధ స్థాయిల్లోని అటవీ అధికారులు విజ్ఞప్తి చేశారు. తాజాగా కాగజ్‌నగర్‌లో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ అనితపై దాడి జరిగిన నేపథ్యంలో తమపై దాడులు జరగకుండా నిరోధించాలని, బాధ్యులపై పీడీయాక్ట్‌ పెట్టాలని, ఈ దాడి వెనక రాజకీయంగా ఎవరున్నారో తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ కేసులను త్వరితంగా పరిష్కరించేందుకు వీలుగా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సోమవారం అరణ్యభవన్‌లో ఐఎఫ్‌ఎస్‌ స్టేట్‌ ఫారెస్ట్‌ సర్వీస్, రేంజ్‌ ఆఫీసర్స్, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్స్, తదితర సంఘాల నేతలు సమావేశమై కాగ జ్‌నగర్‌ దాడి పరిణామాల నేపథ్యంలో సర్కార్‌ నుంచి అన్నివిధాలా సహకారం అందించాలని పీసీసీఎఫ్‌ పీకే ఝాకు వినతిపత్రాన్ని సమర్పించాయి. అధికారులు, సిబ్బంది అధైర్యపడొద్దని, శాఖాపరంగా అన్నివిధాలా మద్దతుగా నిలుస్తామని, ప్రభు త్వపరంగా పూర్తి సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకుంటామని పీకే ఝా పేర్కొన్నట్టు సమాచారం. అటవీ సిబ్బంది ప్రభుత్వ నిబంధనల ప్రకారమే హరితహారంలో భాగంగా ప్రత్యామ్నాయ అటవీ పెంపకం చేస్తున్నట్టు సమావేశంలో వివిధ స్థాయిల అధికారులు పేర్కొన్నారు. అటవీ భూములను ఆక్రమించటమే కాకుండా తమపైనే దాడికి దిగుతున్న వారిపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని, వేగంగా విచారణ చేయటంతో పాటు చట్ట ప్రకారం నిందితులను శిక్షించాలని కోరా రు. సమావేశంలో ఐఎఫ్‌ఎస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు పి.రఘువీర్, వైస్‌ ప్రెసిడెంట్‌ మునీంద్ర, సెక్రటరీ లోకేష్‌ జైస్వాల్, జాయింట్‌ సెక్రటరీ స్వర్గం శ్రీనివాస్, స్టేట్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అసోసియేషన్, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్ల అసోసియేషన్, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

అడవుల్లోని పరిస్థితులపై సర్కార్‌కు నివేదిక.. 
కాగజ్‌నగర్‌ ఘటన నేపథ్యంలో అడవుల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితులు, అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతరత్రా అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి పీసీసీఎఫ్‌ పీకే ఝా నివేదిక సమర్పించినట్టు సమాచా రం. ప్రస్తుతం వర్షాల సీజన్‌ మొదలవుతుండటం తో అటవీ ఆక్రమణలు వేగం పుంజుకుంటున్నాయని, కొత్తగా పెరుగుతున్న ఆక్రమణలను అరికట్టే క్రమంలో దాడులు పెరుగుతున్నాయని అటవీ శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కొత్తగా అటవీభూమిని సాగులోకి తెచ్చేందుకు దున్నడం, ఇతర పొలం పనులు మొదలుపెట్టి దానిని కొన్నేళ్లుగా సాగు చేస్తున్నట్టుగా చూపే యత్నం జరుగుతోందని, రాజకీయ నేతల జోక్యం పెరగడంతో, స్థానిక స్థాయిల్లో వారి అండతో అనుచరుల దాడులు పెరిగాయని పేర్కొన్నట్టు తెలిసింది. అడవుల్లో హరితహారం, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం వంటి కార్యక్రమాలకు వీరి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించినట్టు సమాచారం. అటవీ ఆక్రమణలు బాగా పెరుగుతు న్నాయని వరంగల్‌ రూరల్‌ జిల్లాలో అత్యధికంగా 85 శాతం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో 27 శాతం, ఆదిలాబాద్‌ జిల్లాలో 21 శాతం, భద్రాద్రి కొత్తగూడెంలో 18 శాతం, కొమురం భీం జిల్లాలో 15 శాతం ఆక్రమణలు చోటుచేసుకున్నట్టు ప్రభు త్వం దృష్టికి తెచ్చినట్టు సమాచారం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top