అడవి బిడ్డల ‘స్వయంపాలన’! | Adivasis Self-governance | Sakshi
Sakshi News home page

అడవి బిడ్డల ‘స్వయంపాలన’!

Jun 2 2018 2:12 AM | Updated on Jun 2 2018 2:12 AM

Adivasis Self-governance - Sakshi

శుక్రవారం కుమురంభీం జిల్లా మార్లవాయిలో లంబాడా ఉపాధ్యాయులు వెళ్లిపోవాలని బ్యాండుమేళాలు వాయిస్తూ కోరుతున్న ఆదివాసీలు

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదివాసీలు ముందుగా చెప్పినట్లుగానే గూడేల్లో స్వయం పాలనను ప్రారంభించారు. మావ నాటే మావ రాజ్‌.. మావ నాటే మావ సర్కార్‌.. అనే నినాదంతో అడుగు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో చర్చలు విఫలమైన తర్వాత గూడేల్లో స్వయం పాలనను గురువారం అర్ధరాత్రి నుంచే ప్రారంభిస్తున్నామని చెప్పిన తుడుందెబ్బ నేతలు.. ఆ దిశగానే కదిలారు. కుమురంభీం జిల్లా జైనూర్‌ మండలం మార్లవాయిలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదివాసీలు తమ సంప్రదాయ వాయిద్యాల మధ్య స్వయం పాలనను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివాసీ గూడేల్లో చాలాచోట్ల ఇలాంటి సంబరాలే జరిగాయి. 

అధికారులు, టీచర్ల అడ్డగింత: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గూడేల్లో శుక్రవారం ఉదయం నుంచే ఉద్యమం ప్రారంభించారు. గూడేల్లోని ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల నుంచి వెళ్లిపోవాలంటూ లంబాడా ఉపాధ్యాయులను కోరారు. శనివారం నుంచి అసలు రావద్దని స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, గుడిహత్నూర్, బోథ్‌ మండలాల్లో, కుమురంభీం జిల్లాలోని జైనూర్, సిర్పూర్‌ (యు), లింగాపూర్, కెరమెరి, వాంకిడి మండలాల్లో లంబాడా ఉపాధ్యాయులను రానివ్వలేదు. దీంతో పాఠశాలల్లో విద్యాబోధన సాగలేదు. నార్నూర్‌ మండలంలోని జమాడలో ఆదివాసీలపై లంబాడా ఉపాధ్యాయులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్యకు లంబాడా ఉపాధ్యాయులు సమాచారం అందించగా.. ఎలాంటి వివాదం చేయకుండా ఐటీడీఏకు తిరిగి రావాలని వారికి చెప్పినట్లు సమాచారం. 

నేడు తుడుందెబ్బ జెండాల ఆవిష్కరణ 
ఆదివాసీ సంఘాలు ఉట్నూర్‌ ఐటీడీఏ ఎదుట తుడుందెబ్బ జెండాను ఆవిష్కరించారు. శనివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ గూడేలన్నింటిలో తుడుందెబ్బ జెండాను ఆవిష్కరించాలని ఆదివాసీలు నిర్ణయించారు.    మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. బందోబస్తును మరింత పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  


‘‘నిషేధిత గ్రామం.. మావ నాటే మావ రాజ్‌.. మావ నాటే మావ సర్కార్‌.. అవర్‌ విలేజ్‌ అవర్‌ రూల్‌.. అవర్‌ విలేజ్‌ సెల్ఫ్‌ గవర్నమెంట్‌.. అండర్‌ యాక్ట్‌ 243, 244(1) పెసా చట్టాన్ని అనుసరించి పైన తెలుపబడిన నినాదం మా ఊళ్లో అమలులో ఉన్నది. కావున అనుమతి లేనిదే లోనికి ప్రవేశించకూడదు. పెసా కార్యకర్త, గ్రామ పటేల్‌ను సంప్రదించాలి. ఇట్లు మార్లవాయి గ్రామస్తులు..’’ఇది కుమురంభీం జిల్లా జైనూర్‌ మండలంలోని మార్లవాయి గ్రామ పొలిమేరలో శుక్రవారం వెలసిన బోర్డు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement