కన్వీనర్‌ కోటాలో అదనంగా 2,378 సీట్లు | Additional Engineering Seats In Convenor Quota | Sakshi
Sakshi News home page

కన్వీనర్‌ కోటాలో అదనంగా 2,378 సీట్లు

May 29 2018 3:58 AM | Updated on May 29 2018 3:58 AM

Additional Engineering Seats In Convenor Quota - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఈసారి కన్వీనర్‌ కోటా సీట్లు పెరిగాయి. 2017–18లో ఈ కోటాలో 62,188 సీట్లు ఉండగా.. ఈసారి (2018–19) 64,566 సీట్లు అందుబాటులో ఉన్నట్టు ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. అంటే గతేడాదికన్నా 2,378 సీట్లు పెరిగాయి. ఇందులో అత్యధికంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) కోర్సులోనే సీట్లు ఎక్కువగా పెరగడం గమనార్హం. ఐటీలో గతేడాది 2,487 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి 3,369 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ (ఈఈఈ)లో మాత్రం సీట్లు తగ్గిపోయాయి. ఈ కోర్సు కన్వీనర్‌ కోటాలో గతేడాది 8,412 సీట్లు ఉండగా.. ఈసారి 8,372 సీట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా కన్వీనర్‌ కోటా సీట్లను కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేసేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపట్టింది. గతేడాది 29 కోర్సుల్లో ప్రవేశాలకు చర్యలు చేపట్టగా.. ఈసారి రెండు కొత్త కోర్సులకు అనుమతులు వచ్చాయి. అందులో పెట్రోలియం ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో 42 సీట్లకు, ఫార్మాస్యుటికల్‌ ఇంజనీరింగ్‌లో 42 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి.

టాప్‌–100లో ముగ్గురే హాజరు 
ఇంజనీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రారంభమైంది. తొలిరోజున ఒకటో ర్యాంకు నుంచి 10 వేల ర్యాంకు వరకు విద్యార్థులను పిలవగా.. 5,699 మంది వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. అందులో టాప్‌–100లోపు ర్యాంకులు వచ్చినవారు కేవలం ముగ్గురే ఉండటం గమనార్హం. 101 ర్యాంకు నుంచి 500లోపు ర్యాంకు వారిలోనూ 63 మందే హాజరయ్యారు. ఇక స్పెషల్‌ కేటగిరీలో భాగంగా ఒకటో ర్యాంకు నుంచి 40 వేల ర్యాంకు వరకున్న ఎన్‌సీసీ విద్యార్థుల్లో వెరిఫికేషన్‌కు 6,075 మంది హాజరయ్యారు. మంగళవారం (29న) 10,001వ ర్యాంకు నుంచి 25 వేల ర్యాంకు వరకు, ఎన్‌సీసీ కేటగిరీలో 40,001వ ర్యాంకు నుంచి 80 వేల ర్యాంకు వరకు విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరుగుతుందని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. వెరిఫికేషన్‌ పూర్తయిన విద్యార్థులంతా వచ్చే నెల 5వ తేదీలోగా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement