కల్యాణ కానుక ఏది..? 

68000 Kalyana Lakshmi and Shadi mubarak applications - Sakshi

ఆర్నెల్లు గడుస్తున్నా అందని ఆర్థికసాయం 

పెండింగ్‌లో 68 వేల కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తులు 

పరిశీలన దశ దాటని వేలాది అప్లికేషన్లు 

వరుస ఎన్నికల కారణంగా అటకెక్కిన క్షేత్రపరిశీలన 

దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు 

సాక్షి, హైదరాబాద్‌: కల్యాణకానుక పంపిణీలో జాప్యం నెలకొంది. పెళ్లినాటికే ఇవ్వాల్సిన సాయం ఆర్నెల్లు గడుస్తున్నా అందడంలేదు. వరుస ఎన్నికలు, క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతుండడంతో ఆలస్యమవుతోంది. పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను తీసుకొచ్చింది. పెళ్లిరోజునాటికి లబ్ధిదారులకు ఈ పథకం కింద రూ.1,00,116 అందించాలని నిర్ణయించింది. కానీ, దరఖాస్తుల సమర్పణ, పరిశీలనతో సాయం అందజేత దాదాపు నెల రోజులు పడుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 68 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారుల అంచనా. వీటి పరిష్కారానికి దాదాపు రూ.700 కోట్లు అవసరం. 

అటకెక్కిన పరిశీలన... 
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల కింద వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి పరిశీలిస్తారు. ఈ బాధ్యతలు రెవెన్యూ యంత్రాంగం చూస్తుంది. దరఖాస్తుదారు కుటుంబంతోపాటు సమీపంలోని వారి దగ్గర నుంచీ సమాచారం సేకరించి అర్హతను నిర్ధారిస్తారు. గతేడాది చివర నుంచి వరుసగా ఎన్నికలు జరుగుతుండటంతో రెవెన్యూ యం త్రాంగమంతా ఆ క్రతువులో నిమగ్నమైంది. అసెంబ్లీ, పంచాయతీ, పార్లమెంటు, పరిషత్‌ ఎన్నికలతో ఆర్నెల్లు గడిచిపోయాయి. ఓటరు జాబితా సవరణ మొదలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణల్లో యంత్రాంగం తలమునకలు కావడంతో దరఖాస్తులు పరిశీలనకు నోచుకోలేదు.  

గత బకాయిలు రూ.147.33 కోట్లు 
ఎన్నికల ప్రక్రియతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల బకాయిలు కుప్పలుగా పేరుకుపోయాయి. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు 14,716 దరఖాస్తులకు సంబంధించిన చెల్లింపులు చేయలేదు. దీంతో రూ.147 కోట్లు బకాయిలున్నాయి. వీటిని తదుపరి ఏడాదికి కలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పెళ్ళిళ్లు జోరుగా జరిగాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు కూడా అదే తరహాలో దరఖాస్తులు వచ్చాయి. ఏప్రిల్, మే నెలలో దాదాపు 53 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. వీటిని వెంటవెంటనే పరిశీలించి పరిష్కరించాలి. మరోవైపు వెబ్‌సైట్‌ నిర్వహణ ఉండటంతో దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సాంకేతిక సమస్యలు నెలకొనడంతో వెబ్‌సైట్‌ అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. దీంతో గత కొన్నిరోజులుగా దరఖాస్తు ప్రక్రియ నెమ్మదించింది. వెబ్‌సైట్‌ సమస్య పరిష్కారమైతే దరఖాస్తులు సైతం మరిన్ని పెరిగే అవకాశం ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top