నిరుపేదలకు సద్దిమూట

5 Rupees Meals In Tanduru - Sakshi

మున్సిపాలిటీల పరిధిలో రూ.5కే భోజనం

తాండూరు, వికారాబాద్‌లో అందుబాటులోకి రానున్న సేవలు

పథకం అమలుకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశం

ఆర్థికభారం తప్పదంటున్న అధికారులు

తాండూరు : మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యాన తాండూరు, వికారాబాద్‌లో నిరుపేదలు, అభాగ్యులకు కేవలం రూ.5కే భోజనం అందించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. సింగిల్‌ చాయి ఖరీదు రూ.7 నుంచి రూ.10 ఉన్న ఈ సమయంలో పేదవాళ్ల ఆకలిబాధ తీర్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎంత చిన్న హోటల్లో భోజనం చేయాలన్నా రూ.50 నుంచి రూ.70 వరకు ఖర్చు చేయాల్సిన తరుణంలో రూ.5కే భోజనం అందించేందుకు కార్యచరణ సిద్ధమవుతోంది.

మున్సిపల్‌ శాఖ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో రూ.5కే నాణ్యమైన భోజనం త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇటీవల ప్రకటించారు. రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీల్లో ఈ సేవలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు త్వరలోనే కౌన్సిల్‌ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌ మున్సిపాలిటీల్లో ఈ పథకం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామీణ జిల్లా కావడంతో దీనికి పేదల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు భావిస్తున్నారు.   

ఫుల్‌ భోజనమే... 

మున్సిపల్‌ శాఖ ద్వారా మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్న రూ.5 భోజనంలో అన్నం, కూరగాయలతో చేసిన కర్రీ, పప్పు, పచ్చడి, సాంబారు, మజ్జిగ, నీళ్ల ప్యాకెట్‌ అందిస్తారు. ప్రస్తుతం హోటల్, మెస్‌లలో ప్లేట్‌ భోజనం రూ.50 నుంచి రూ.80 పలుకుతోంది. మున్సిపల్‌ శాఖ ద్వారా అందించనున్న భోజనంతో వందలాది మంది కార్మికులు, రైతులు, పేద, మధ్య తరగతి ప్రజల కడుపు నిండనుంది.   

‘సంపూర్ణ’ భోజనం.. రూ.15 

తాండూరు పట్టణంలో సంపూర్ణ సంస్థ ఆధ్వర్యం లో 6 నెలలుగా రూ.15లకే భోజనం అందిస్తున్నారు. సంపూర్ణ సంస్థ తాండూరు పట్టణంలోని బస్టేషన్‌ ప్రాంగణంలో, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, ఇందిరాచౌక్‌ల వద్ద ఏర్పాటు చేసిన భోజన కేంద్రాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రతీ రోజు 500 మందికి పైగా తాండూరు నియోజకవర్గంలోని ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సంపూర్ణ సంస్థ అందిస్తున్న భోజనం కన్నా 100 శాతం నాణ్యతతో మున్సిపల్‌ శాఖ రూ.5కే భోజనం అందించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా పథకం అమలుతో మున్సిపాలిటీలకు అదనపు భారం తప్పదని అధికారులు చెబుతున్నారు.  

కౌన్సిల్‌ సభ్యులతో సమావేశం   

మున్సిపల్‌ శాఖ ద్వారా ప్రారంభించాలనుకుంటు న్న రూ.5 భోజనంపై.. త్వరలోనే మున్సిపల్‌ కౌ న్సిల్‌ సభ్యులతో సమావే శం నిర్వహిస్తాం. భోజనం నిర్వహణపై ఉన్న తాధికారుల నుంచి ఇంకా విధి విధానాలు అందలేదు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకం కావడంతో త్వరలోనే రూ.5 భోజనం అందించేలా ప్రణాళిక తయారు చేస్తున్నాం. 

– భోగీశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్, తాండూరు   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top