కరోనా కల్లోలం | 43 New Corona Positive Cases Registered In Telangana | Sakshi
Sakshi News home page

కరోనా కల్లోలం

Apr 5 2020 1:19 AM | Updated on Apr 5 2020 11:01 AM

43 New Corona Positive Cases Registered In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. శనివారం మరో 43 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 272కు చేరుకుంది. కరోనా బాధితుల్లో 235 మంది ఢిల్లీ మర్కజ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు, వారి కుటుంబీకులే కావడం గమనార్హం. 165 మంది మర్కజ్‌ నుంచి నేరుగా వచ్చిన వారికి కరోనా పాజిటివ్‌గా తేలగా మరో 70 మంది వారి కుటుంబ సభ్యులు, వారితో కాంటాక్ట్‌ అయిన వారని వైద్య, ఆరోగ్యశాఖలో కీలక అధికారి వెల్లడించారు.

మిగిలిన వారు వివిధ దేశాల నుంచి వచ్చినవారు, వారి కుటుంబీకులు, స్థానికంగా ఎటువంటి కాంటాక్ట్‌తో సంబంధం లేకుండా సోకిన వారు ఉన్నట్లు చెప్పారు. శనివారం 600 మందికి పరీక్షలు నిర్వహించగా 43 మంది పాజిటివ్‌గా తేలినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఆదివారం మరో 480 మంది కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అలాగే మర్కజ్‌ నుంచి వచ్చిన వారితో కాంటాక్ట్‌ అయిన సుమారు 3,300 మందికి రానున్న వారం రోజుల్లో పరీక్షలు నిర్వహించనున్నామని, అందులో సుమారు 600 పాజిటివ్‌ కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోందని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ నుంచే 111 మందికి..
ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌ నుంచే 111 మంది వైరస్‌బారిన పడ్డారు. వారిలో ఇప్పటివరకు ఏడుగురు మరణించగా 11 మంది డిశ్చార్జి అయ్యారు. అలాగే వరంగల్‌ అర్బన్‌లో 22 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన నివేదికలో వెల్లడించింది. అందులో ఒకరు డిశ్చార్జి అయ్యారు. నిజామాబాద్‌ జిల్లాలో 19 పాజిటివ్‌ కేసులు నమోదవగా ఒకరు మృతి చెందారు.

1,090 మందికి మర్కజ్‌ లింక్‌: ఈటల
తెలంగాణలో కరోనా వైరస్‌ జనసమూహంలోకి వ్యాపించలేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. ప్రస్తుతం పాజిటివ్‌గా నమోదవుతున్న కేసులన్నీ మర్కజ్‌ నుంచి వచ్చిన వారు లేదా వారితో కలిసిన వారు మాత్రమేనన్నారు. షాద్‌నగర్‌లో, సికింద్రాబాద్‌లో మరణించిన వారు కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వారితో కలిసిన వారేనని ఆయన చెప్పారు. మర్కజ్‌ నుంచి 1,090 మంది రాష్ట్రానికి వచ్చారని, వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని క్వారంటైన్‌ కేంద్రాల్లో డాక్టర్లను నియమించామని, ఇప్పటికే నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నారన్నారు. అన్ని సెంటర్లలోనూ సరిపడిన స్థాయిలో ఎన్‌–95 మాస్క్‌లు, కిట్లు అందుబాటులో ఉన్నట్లు ఈటల వివరించారు. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత తమ బాధ్యతన్నారు.

వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనతో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సీఎస్, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నామన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం 6 ల్యాబ్‌లు 24 గంటలూ పనిచేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని పాజిటివ్‌ కేసులు వచ్చినా చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామన్నారు. గచ్చిబౌలిలో 1,500 పడకల ఆస్పత్రి మరో రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. 5 లక్షల ఎన్‌–95 మాస్కులు, 5 లక్షల పీపీఈ కిట్లు, 5 లక్షల వైరల్‌ ట్రాన్స్‌మిషన్‌ కిట్లు, 500 వెంటిలేటర్లు, 4 లక్షల కరోనా టెస్టింగ్‌ కిట్లు, 20 లక్షల సర్జికల్‌ మాస్కులు, 25 లక్షల హ్యాండ్‌ గ్లౌజులు కొనుగోలు చేశామని మంత్రి ఈటల చెప్పారు.

కరోనాపై లక్ష ఇళ్లలో సర్వే 
కరోనా వైరస్‌ బాధితులను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,376 బృందాలు రంగంలోకి దిగాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య బృందాలు 1.07 లక్షల ఇళ్లలో సర్వే చేశాయని, 4.46 లక్షల మందిని నేరుగా కలుసుకొని వారిలో కరోనా బాధితులున్నారా లేదా నిర్ధారించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. చివరకు 147 మందిలో లక్షణాలున్నాయని గుర్తించి వారిని ఆస్పత్రులకు రిఫర్‌ చేసినట్లు చెప్పారు. జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో వైరస్‌ కట్టడి ప్రణాళిక అమలు చేస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement