తెలంగాణలో స్వైన్ ఫ్లూ మృత్యు ఘంటికలు మోగిస్తోంది.
86 మంది పాజిటివ్ బాధితులకు చికిత్స..
మహబూబ్‌నగర్ అడిషనల్ జాయింట్ కలెక్టర్‌కూ స్వైన్‌ఫ్లూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వైన్ ఫ్లూ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రవ్యాపంగా 1,156 మందికి పరీక్షలు చేయగా.. 411 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఇప్పటివరకూ 22 మంది మృతి చెందగా, మంగళవారం మరో నలుగురు మరణించారు. వీరిలో గాంధీలో చికిత్స పొందుతున్న రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్‌కు చెందిన పోల శైలజ(36) సోమవారం రాత్రి, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన టీవీజీ ప్రసాద్ (54), మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్ పంచాయతీ రెడ్డిపాలేనికి చెందిన మేరమ్మ (50) మంగళవారం మృతి చెందారు. అదేవిధంగా గ్రేటర్ పరిధిలోని చంపాపేట సాయినగర్‌కు చెందిన బ్రహ్మయ్యనాయుడు(40) ఆదివారం రాత్రి చనిపోగా... స్వైన్ ఫ్లూతో చనిపోయినట్లు వైద్యులు మంగళవారం ధ్రువీకరించారు.
వివిధ ఆస్పత్రుల్లో 86 మంది బాధితులు
గాంధీ ఆస్పత్రిలో 71 మంది చికిత్స పొందుతుండగా.. వీరిలో 38 మంది పాజిటివ్, 36 మంది అనుమానితులు ఉన్నారు. స్వైన్‌ఫ్లూ బారిన పడినవారిలో ఆదిలాబాద్ జిల్లా మందమర్రికి చెందిన ఆరేళ్ల చిన్నారి లలిత కూడా ఉంది. ఉస్మానియాలో 19 మందికి వైద్యం అందిస్తుండగా, వీరి లో ఐదుగురు జూనియర్ డాక్టర్లు. ఫీవర్ ఆస్పత్రిలో 32 మంది చికిత్స పొందుతుండ గా ఏడుగురు పాజిటివ్ బాధితులు, 25 మంది అనుమానితులు ఉన్నారు. యశోద, కేర్, కిమ్స్, అపోలో, కామినేని, ఆదిత్య, గ్లోబల్, లోటస్, రెయిన్‌బో తదితర ప్రైవేట్ ఆస్పత్రుల్లో మరో 41 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ఆస్పత్రుల్లోనే మరో 50 మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు. కాగా, మహబూబ్‌నగర్ అడిషనల్ జాయింట్ కలెక్టర్ రాజారాం కూడా స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు.
స్వైన్‌ఫ్లూతో జాగ్రత్త : మంత్రి చందూలాల్
సాక్షి, హైదరాబాద్: రాబోయే రెండు వారాల పాటు చలి తీవ్రత ఉంటుందన్న హెచ్చరికల కారణంగా స్వైన్‌ఫ్లూ పూర్తిగా తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశించారు. చిన్న పిల్లలకు ఇది సోకే ప్రమాదం ఉన్నందున ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సమర్థవంతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాల గిరిజన సంక్షేమ అధికారులతో మంగళవారం మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత వాతావరణం స్వైన్‌ఫ్లూకు అనుకూలంగా ఉన్నందున విద్యార్థులు చలి తీవ్రత బారినపడకుండా చూడాలన్నారు.