రాష్ట్రవ్యాప్తంగా కంటైన్మెంట్‌ క్లస్టర్లు  | 130 Corona Hotspots In Telangana Will Hand Over By Police | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా కంటైన్మెంట్‌ క్లస్టర్లు 

Apr 10 2020 1:43 AM | Updated on Apr 10 2020 11:24 AM

130 Corona Hotspots In Telangana Will Hand Over By Police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా కేసులు రోజురోజుకూ పదుల సంఖ్యలో వెలుగు చూస్తుండటంతో ప్రభుత్వం కరీంనగర్‌ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అనుసరించేందుకు సిద్ధమైంది. కరోనా కేసులు అధికంగా ఉన్న 130 ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించింది. వీలైనంత త్వరగా ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉంది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు బుధవారమే ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఇదే అత్యుత్తమ విధానంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తొలుత కరీంనగర్‌లో ఇదే ఫార్ములాతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో పోలీసులు, ఆరోగ్య శాఖ విజయవంతమయ్యాయి. కానీ మర్కజ్‌ యాత్రికుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూ పోతుండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

పోలీసులు ఏం చేస్తారంటే..? 
కరోనా హాట్‌స్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఈ ప్రాంతాల నుంచి కేసులు అధికంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు కాలనీ, డివిజన్‌ లేదా ఊరు మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. సదరు ప్రాంతానికి దాదాపు కిలోమీటరు ప్రాంతంలో ఎవరినీ బయటికి వెళ్లనివ్వరు. జనసంచారం పూర్తిగా నిషిద్ధం. సూటిగా చెప్పాలంటే ఆ ప్రాంతం మొత్తం హోం క్వారంటైన్‌ అయినట్లే. వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ప్రాంత వాసులంతా అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ఎవరికైనా అత్యవసర సమస్యలు ఉత్పన్నమైతే పోలీసులకు సమాచారమివ్వాలి. అందుకు ప్రత్యేకంగా నంబర్లు ఇస్తారు. రోజూ నిత్యావసరాలు ఇంటికే వస్తాయి. ఈ బాధ్యతలన్నీ ఆయా జిల్లాల కలెక్టర్లు, మార్కెటింగ్, పౌరసరఫరాలు, బల్దియాలు సమన్వయం చేసుకుని పోలీసుల సమక్షంలో పంపిణీ చేస్తాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో 12 ప్రాంతాలను కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. 

ఎంత కాలం అంటే.. 
సాధారణంగా 14 రోజుల పాటు ఆయా ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఇంటింటి సర్వే చేస్తారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ 14 రోజుల్లో ఏ రోజు పాజిటివ్‌ కేసులు వెలుగుచూసినా మరో 14 రోజులు దిగ్బంధనం పెంచుతారు. ఉదాహరణకు చివరి రోజు ఒక్క కేసు వెలుగుచూసినా.. మరో రెండు వారాలు ఆ ప్రాంత వాసులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. పూర్తిగా ఆ ప్రాంతాల్లో ప్రజలందరికీ నెగెటివ్‌ వచ్చే వరకు పోలీసుల కనుసన్నల్లోనే ఉంటాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement