పసిబిడ్డ పునర్జన్మ కోసం..

11 Month Old Zimbabwean Baby Treated In Hyderabad - Sakshi

11 నెలల జింబాబ్వే శిశువుకు నగరంలో చికిత్స

శిశువుకు పునర్జన్మను ప్రసాదించిన కిమ్స్‌ వైద్యులు

సాక్షి, హైదరాబాద్‌: పుట్టుకతోనే హృద్రోగ సమస్యతో మృత్యువుతో పోరాడుతున్న తన కొడుకును కాపాడుకునేందుకు ఓ తల్లి సుదూరాల తీరం దాటి నగరానికి తీసుకొచ్చింది.ఎంతో వ్యయప్రయాసలకోర్చి యోజనాల దూరం దాటి ఇక్కడకు తెచ్చిన కన్నపేగు బంధం నగర వైద్యుల్లో తమ సంకల్ప బలాన్ని రెట్టింపు చేసింది. 20 గంటలపాటు డాక్టర్లు శ్రమించి చికిత్స చేసి ఆ పసిబిడ్డకు పునర్జన్మను ప్రసాదించారు. అతిక్లిష్టమైన చికిత్సను చేసి శిశువుకు ప్రాణం పోసి అంతర్జాతీయంగా నగర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసింది కిమ్స్‌ వైద్య బృందం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కిమ్స్‌ ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ ఆదివారం మీడియాకు వెల్లడించారు.

ఆయాసం..గుక్కపట్టి ఒక్కటే ఏడుపు
జింబాబ్వేకు చెందిన నోరా సిటుంబెకో 11 నెలల క్రితం ఓ మగ శిశువుకు జన్మనించింది. పుట్టిన తర్వాత శిశువు సరిగా పాలు తాగకపోవడంతో పాటు ఆయాసం, గుక్కపట్టి ఏడవటం వంటి సమస్యలతో బాధపడుతుండటంతో తల్లి నోరా సిటుంబెకో చికిత్స కోసం స్థానికంగా ఉన్న పలువురు వైద్యులను ఆశ్రయించింది. పరీక్షించిన వైద్యులు శిశువు క్లిష్టమైన హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. జింబాబ్వేలో నిపుణులు లేకపోవడంతో వారు హైదరాబాద్‌లోని కిమ్స్‌కి సిఫార్సు చేశారు. దీంతో తల్లి నోరా తన బిడ్డతో గత నెలలో నగరం చేరుకుంది.  

యూనిఫోకలైజేషన్‌ పద్ధతిలో చికిత్స
ఆస్పత్రికి చెందిన చిన్నపిల్లల గుండె చికిత్సల వైద్య నిపుణుడు డాక్టర్‌ అనిల్‌కుమార్‌ శిశువును పరీక్షించారు. 2డిఎకో, ఈసీజీ, ఆ్రల్టాసౌండ్‌ సహా పలు వైద్య పరీక్షలు చేశారు. గుండె కుడి జఠరిక నుంచి ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే రక్తనాళం లేకపోవడంతో పాటు ఎడమ ఊపిరితిత్తులకు రావాల్సిన రక్తనాళాల శాఖలు కూడా చిన్నగా ఉన్నట్లు గుర్తించారు. ఊపిరితిత్తులకు మాప్కాస్‌ అనే నాళా ల నుంచి రక్తం సరఫరా అవుతుండటమే శిశువు హృద్రోగ సమస్యకు కారణంగా గుర్తించారు. వైద్య పరిభాషలో ‘పల్మనరీ ఆట్రిíÙయా’గా పిలుస్తారు. రక్త ప్రసరణను సాధారణ స్థితికి తెచి్చ, శిశువు ఆరోగ్యాన్ని కాపాడేందుకు క్లిష్టమైన యూనిఫోకలైజేషన్‌ అనే ప్రక్రియను వైద్యులు ఎంచుకున్నారు. గుండె వెనుక నుంచి వచ్చే అయోటా నుంచి మాప్కాస్‌లను తప్పించి, గుండె నుంచి నేరుగా ఊపిరితిత్తులకు ప్రత్యామ్నాయంగా రక్తనాళాలు ఏర్పాటు చేసి సరఫరాను పునరుద్ధరించారు.  చికిత్సకు 20 గంట ల సమయం పట్టినట్లు అనిల్‌ తెలిపారు. శిశువు ఆరోగ్యం మెరుగుపడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశామన్నారు. తన కొడుకుని బతికించిన వైద్యులకు రుణపడి ఉంటానని తల్లి నోరా తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top