హైదరాబాద్‌లో లక్ష ‘డబుల్‌’ ఇళ్లు

1 lakh 2BHK in Hyderabad in a year, reiterates KTR - Sakshi

ఏడాదిలోగా పూర్తి చేస్తాం: మంత్రి కేటీఆర్‌

అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: ఏడాదిలోగా హైదరాబాద్‌ నగరంలో లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు మేరకు 12 నెలల వ్యవధిలో నిర్మాణం పూర్తి చేసేందుకు పట్టుదలతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో డబుల్‌ ఇళ్ల నిర్మాణంపై గురువారం జల మండలి కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. సకాలంలో పనులు పూర్తి చేస్తే కాంట్రాక్టర్లకు అదనపు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు.

నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. నిబంధనల మేరకు పాటించాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించాలని కోరారు. వీటి నిర్మాణానికి ఇసుక సరఫరా కోసం తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎండీసీ) ఆధ్వర్యంలో నాలుగు ఇసుక డిపోలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. పనుల పర్యవేక్షణ కోసం అధికారులు, కాంట్రాక్టర్లు ప్రత్యేకంగా ఓ వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

డబుల్‌ ఇళ్ల నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం అని, ఇందుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ ఇళ్ల నిర్మాణంలో ఏవైనా ఇబ్బం దులుంటే తెలపాలని కాంట్రాక్టర్లకు కేటీఆర్‌ సూచిం చారు. కాంట్రాక్టర్లు తెలిపిన సమస్యలతోపాటు పలు అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. నవం బర్‌లోగా అన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యేలా ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఈ సంద ర్భంగా నగర ఎమ్మెల్యేలు, అధికారుల సమావేశంలోనే ఫోన్‌ చేసి మాట్లాడారు. సమావేశంలో పురపాలక శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌ రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top