
మిర్యాలగూడ : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత నామినేషన్ల ఘట్టం మిర్యాలగూడ డివిజన్‌లో నేటినుంచి ప్రారంభం కానుంది. డివిజన్ పరిధిలో మొత్తం 276 గ్రామ పంచాయతీలు, 2,376 వార్డులు ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తం ఓటర్లు 2,92,043 మంది ఉన్నారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో నామినేషన్ల స్వీకరణకు 83 క్లస్టర్ గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. శుక్రవారంనుంచి మూడు రోజుల పాటు అంటే 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 14వ తేదీ నామినేషన్ల స్క్రూటినీ, 15, 16వ తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ చేపడతారు. 17వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ప్రకటించనున్నారు. 25వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు లెక్కింపు చేపట్టనున్నారు.
క్లస్టర్ గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ..
మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పది మండలాల్లో 276 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కానీ క్లస్టర్ గ్రామ పంచాయతీలలోను నామినేషన్ల ప్రకియ కొనసాగుతుంది. డివిజన్ పరిధిలో మొత్తం 83 క్లస్టర్ గ్రామాలలో నామినేషన్ల కార్యక్రమం నిర్వహిస్తారు. డివిజన్‌లోని మాడ్గులపల్లి మండలంలోని 8, వేములపల్లిలో 3, పెద్దవూరలో 9, నిడమనూరులో 10, దామరచర్లలో 11, అడవిదేవులపల్లిలో 6, అనుములలో 6, తిర్మలగిరిసాగర్‌లో 6, త్రిపురారంలో 10, మిర్యాలగూడ మండలంలో 14 గ్రామ పంచాయతీలలో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం 83 మంది స్టేజ్ –1 ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, 90 మంది స్టేజ్–1 అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
బృందావనపురం చిన్న పంచాయతీ
రెండో విడత ఎన్నికలు నిర్వహించే మిర్యాలగూడ డివిజన్ పరిధిలో త్రిపురారం మండలంలోని బృందావనపురం గ్రామ పంచాయతీ అతి చిన్న పంచాయతీ. ఇక్కడ మొత్తం నాలుగు వార్డులు మాత్రమే ఉండగా ఓటర్లు 95 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అతి పెద్ద గ్రామ పంచాయతీగా దామరచర్ల మండల కేంద్రం ఉంది. దామరచర్ల గ్రామ పంచాయతీలో మొత్తం 14 వార్డులు ఉండగా 5,337 మంది ఓటర్లు ఉన్నారు.