
హెచ్‌ఐసీసీలో ఈ-గవర్నెన్స్ 21వ జాతీయ సదస్సు ప్రారంభం
ఈ- గవర్నెన్స్‌లో తెలంగాణలో ముందంజలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ఈ- గవర్నెన్స్‌లో తెలంగాణలో ముందంజలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని హెచ్‌ఐసీసీ లో ఈ-గవర్నెన్స్ 21వ జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ సదస్సును కేంద్ర సహాయమంత్రి సీఆర్ చౌదరి, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ-గవర్నెన్స్‌తో ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించ వచ్చని స్పష్టం చేశారు. పౌరసేవల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 4,500 మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
టీ వ్యాలెట్ ద్వారా సులభమైన పద్ధతిలో లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. పౌరసేవల కోసం ఆర్టీఏ ఎం వ్యాలెట్ అందుబాటులోకి తీసుకువచ్చాం.. కొద్ది రోజుల్లోనే 1.3 మిలియన్ ప్రజలు ఎం వ్యాలెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. మూడు వారాల్లో భవనాలకు కూడా అనుమతినిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పోలీస్, రవాణా వ్యవస్థలోనూ చాలా మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా త్వరలో ఇంటింటికి ఇంటర్నెట్ ను అందించబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ రాష్ర్టాల ప్రతినిధులు పాల్గొన్నారు.