చెన్నైకి రెండో విమానాశ్రయం

Second Airport Sanctioned In Chennai - Sakshi

సెయ్యూరులో స్థలం ఎంపిక

చెన్నైకి 100 కిలోమీటర్ల దూరం

చెన్నై నుంచి రెండుగంటల ప్రయాణం

సాక్షి ప్రతినిధి, చెన్నై : చెన్నైకి మరో విమానాశ్రయం ‘అక్కడ...కాదు ఇక్కడే’ అంటూ నాలుగేళ్లకు పైగా జరుగుతున్న చర్చకు దాదాపు తెరపడినట్లే. కాంచీపురం సెయ్యూరులో ఎట్టకేలకూ రెండువేల ఎకరాల స్థలాన్ని తమిళనాడు ప్రభుత్వం ఎంపిక చేసింది. ఎయిర్‌పోర్టు చుట్టూ ఏరోసిటీ ఏర్పాటుకు విమానయానశాఖ సమాయత్తం కావడం ద్వారా రెండో ఎయిర్‌పోర్టు సమాచారాన్ని ఖరారు చేసింది. విమాన చార్జీలు మధ్యతరగతి వారికి సైతం అందుబాటులోకి రావడం, విమాన సంస్థలు అనేక రాయితీలతో మరింతగా ఆకర్షించడంతో చెన్నై ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రాకపోకల సంఖ్య భారీగా పెరిగిపోయింది.

ప్రయాణికుల సంఖ్యను అనుగుణంగా విమానాల సేవలను విస్తరించారు. పైగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులు మీనంబాక్కంలనే ఉన్నాయి. ప్రయాణం అంటే దాదాపుగా అందరికీ లగేజీ తప్పనిసరి  కార్గోలో సైతం రద్దీ పెరిగిపోయింది. లగేజీని అప్పగించాలన్నా, డెలివరీ తీసుకోవాలన్నా గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు కొంతకాలంగా ఫిర్యాదులు చేస్తున్నారు. రెండో ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయకతప్పదనే పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం అభిప్రాయపడింది. ఈ ఆలోచన వచ్చిన తరువాత మీనంబాక్కం ఎయిర్‌పోర్టును ఆనుకునే ఉన్న ప్రాంతాలైన పొళిచ్చూరు, అనకాపుత్తూరు, పమ్మల్, కౌల్‌బజార్‌లలోని నివాసప్రాంతాలను ఖాళీ చేయించి విస్తరించాలని తీర్మానించింది.

ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లను వదిలి వెళ్లిపోయేందుకు విముఖత వ్యక్తం చేయడంతో ఈ  ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించింది. మరో ప్రయత్నంగా మధురాంతకం, ఉత్తరిమేరూరు ప్రాంతాలను పరిశీలించి 1500 ఎకరాలను విమానయానశాఖ అధికారులు ఎంపికచేశారు. అయితే కొన్ని కారణాలవల్ల రెండో ప్రయత్నానికి కూడా స్వస్తిపలికారు. ఇక ఆ తరువాత చెన్నైకి సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని శ్రీపెరంబుదూరును పరిశీలించారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలో 1250 ఎకరాలు ఎంపికచేసి విరమించారు.

మొత్తం మీద ఐదోప్రయత్నంగా కాంచీపురం జిల్లా మధురాంతకం సమీపం సెయ్యూరు తాలూకాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకోసం రెండువేల ఎకరాలను రెవెన్యూ అధికారులు ఎంపిక చేశారు. ఈ రెండువేల ఎకరాల్లో మూడు పెద్ద గ్రామాలు, రెండు కుగ్రామాలు ఉన్నాయి. అరప్పోడు, ఆయకున్రం గ్రామాల పేర్లను మాత్రమే అధికారులు బైటపెట్టారు. ఇక్కడ విమానాశ్రయం ఏర్పడినట్లయితే సెయ్యూరు నుంచి చెన్నైకి రెండుగంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సర్వే నంబర్ల ప్రకారం రెండువేల ఎకరాల కొలతలకు ఎంపీపీ పుస్తకాన్ని జిల్లా అధికారులకు అప్పగించారు. సర్వే ముగిసిన తరువాతనే స్థల సేకరణ పనులను ప్రారంభిస్తారు.  ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రయివేటు, ప్రభుత్వ స్థలాలు కూడా కలిసి ఉన్నాయి. సెయ్యూరు పరిసరాలు ఓఎంఆర్, జీఎస్టీ రహదారులను కలుపుకుని ఉన్నందున చెన్నైకి సులభంగా చేరుకోవచ్చు. అయితే దూరం ఎక్కువగా ఉండటం ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయవచ్చు.

           బెంగళూరు విమానాశ్రయంతో పోల్చుకుంటే నగరం సరిహద్దుల నుంచి 35 కిలోమీటర్లు, హైదరాబాద్‌ విమానాశ్రయంతో పోలిస్తే 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే చెన్నై నగరం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో సెయ్యూరు ఉంది. సెయ్యూరు–చెన్నై మధ్య ఎక్స్‌ప్రెస్‌ హైవే ఏర్పాటు చేస్తేనే విమానప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దూరాన్ని దృష్టిలో ఉంచుకుని సెయ్యూరులో అంతర్జాతీయ విమానాశ్రయం, మీనంబాక్కంను అంతరాష్ట్ర (డొమెస్టిక్‌) విమానాశ్రయంగానూ తీర్చిదిద్దాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అలాగే ఎయిర్‌పోర్టు కోసం ఎంపిక చేసిన ప్రాంత పరిసరాల్లో ఏరోసిటీ ఏర్పాటుకు విమానయానశాఖ సన్నాహాలు చేస్తోంది. 

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top