దేశానికి కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టీమ్‌లో ఎంత మందికి స్థానం దక్కుతుందన్న అంకెలపై ఇంకా స్పష్టత రాలేదు.
సాక్షి, ముంబై: దేశానికి కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టీమ్‌లో ఎంత మందికి స్థానం దక్కుతుందన్న అంకెలపై ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా రాష్ట్రానికి చెందిన ఎనిమిది మందికి మోడీ మంత్రి మండలిలో అవకాశం దక్కుతుందని తెలిసింది. బీజేపీకి ఐదు, శివసేనకు మూడు మంత్రి పదవులు కేటాయిస్తారని సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 23, శివసేనకు 18 , స్వాభిమాని షేత్కారీ సంఘటన పార్టీకి ఒకటి ఇలా మొత్తం 42 స్థానాలను మహాకూటమి కైవసం చేసుకుంది. దీంతో కేంద్రంలో కీలక పదవులతోపాటు పదికిపైగా మంత్రి పదవులు రాష్ట్రానికి దక్కే అవకాశాలున్నాయని భావించారు. అయితే కేవలం ఎనిమిది మాత్రమే ఇచ్చే అవకాశముందని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
బీజేపీలో...
లోక్‌సభ ఎన్నికల్లో లభించిన విజయంతో బీజేపీలోని అనేక మంది మంత్రి పదవులపై ఆసక్తి కనబరుస్తున్నారు. గడ్కారీ, గోపీనాథ్ ముండే, హంసారజ్ అహిర్, రావ్‌సాహెబ్ దానవే, కిరీట్ సోమయ్య పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎవరికి దక్కనుందనే విషయమై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
శివసేనలో...
శివసేనలో కూడా మంత్రి పదవులపై అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే శివసేనకు కేవలం మూడు మంత్రి పదవులు లభిస్తాయని తెలుస్తోంది, వీటిలో ఒకటి కేబినేట్ మంత్రి పదవి ఉండవచ్చని వినబడుతోంది. అయితే శివసేన మరో మంత్రి పదవిని ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశముందంటున్నారు. అనంత్ గీతేకు కేంద్ర కేబినేట్ పదవి లభించే అవకాశముంది. చంద్రకాంత్ ఖైరే, ఆనందరావ్ అడసూల్, అనీల్ దేశాయి, శివాజీరావ్ ఆడల్‌రావ్ పాటిల్‌లు కూడా మంత్రి పదవులపై ఆసక్తిని కనబరుస్తున్నారు.