నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు..
- అంగీకరించిననగర పాలక సంస్థ
- అనవసర ఖర్చంటున్న విపక్షాలు
- విద్యార్థులు చదువుకోడానికే అంటున్న బీఎంసీ
ముంబై: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంగీకరించింది. ప్రతిపాదనను బీఎంసీ స్టాండింగ్ కమిటీ బుధవారం ఆమోదించింది. అయితే ఇది అనవసరమైన ఖర్చని.. వైఫై, 3జీ సేవలు లేకుండా ట్యాబ్‌లు ఎలా పనిచేస్తాయని ఇతర పార్టీలు వ్యతిరేకించాయి. ‘ ఇంటర్నెట్ లేకుండా ట్యాబ్లెట్ పంపిణీ చేయడం నిజంగా హాస్యాస్పదం. ట్యాబ్లెట్లు పంపిణీ చేస్తామంటూ శివసేన నిధుల్ని వృథా చేస్తోంది. ముంబైని వైఫై నగరంగా తీర్చి దిద్దాలనుకుంటున్న సేన విద్యార్థులు చదువుకుంటున్న మున్సిపల్ పాఠశాలల్లో ఎందుకు ఆ సదుపాయం కల్పించడంలేదు’ అని బీఎంసీలో ఎంఎన్‌ఎస్ నాయకుడు సందీప్ దేశ్‌పాండే ప్రశ్నించారు.
యువసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే గత వారం ప్రధాని మోదీని కలసి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ, డిజిటల్ ఇండియా ప్రచారానికి అది ఎలా ఉపయోగపడతుందన్న విషయాన్ని వివరించారు. సిలబస్, నోట్స్ కలిగిన ట్యాబ్‌లు విద్యార్థులు చదువుకోడానికి ఎంతో ఉపకరిస్తాయని, వారికి పుస్తకాల భారం కూడా తగ్గిస్తాయని ఠాక్రే, ఇతర శివసేన ఎంపీలు చెప్పారు. మరోవైపు ప్రాజెక్టును వెంటనే నిలిపేయాలని, పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా చాలా ఉన్నాయని ఎన్సీపీ ముంబై అధ్యక్షుడు సచిన్ ఆహిర్ అన్నారు. వర్షాకాలంలో బీఎంసీ పాఠశాలల్లోకి నీరు చేరుతోందన్నారు. ట్యాబ్‌లు ఉపయోగించుకోడానికి వారికి సరైన అవగాహన లేదన్నారు. బీఎంసీ ఈ విధంగా ధన్నాన్ని ఎందుకు వృథా చేస్తోందో తనకు అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. అయితే బీఎంసీ మాత్రం భిన్న వాదనలు వినిపిస్తోంది.