వామ్మో మళ్లీ స్వైన్ ఫ్లూ సైరన్

వామ్మో మళ్లీ స్వైన్ ఫ్లూ సైరన్

  •  ఐదు నెలల్లో పది మంది మరణం..

  •  117 పాజిటివ్ కేసులు గుర్తింపు

  •  ఒక్క ఉడిపి జిల్లాలోనే  నలుగురి మృతి

  •  వైరస్ మరింత  వ్యాప్తి చెందే అవకాశం

  •  జలుబు, దగ్గు, జ్వరం  ఈ వ్యాధి లక్షణాలు

  •  సాక్షి, బెంగళూరు :  రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత జనవరి నుంచి ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూ బారిన పడి 10 మంది చనిపోగా, 117 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో రానున్న మూడు నెలలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.



    స్వైన్ ఫ్లూ  అనేది ‘ఇన్‌ఫ్లుయన్‌జా-ఏ’ (హెచ్1ఎన్1) అనే వైరస్ వల్ల సోకే అంటువ్యాధి. దీని వల్ల రోగి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు లోనవుతాడు. ఈ వ్యాధి సోకిన వారికి విపరీతంగా దగ్గు, జ్వరం ఉంటుంది. ముక్కుల నుంచి నీరు ఎక్కువగా కారుతూ ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో రోగి తీవ్ర ఇబ్బందికి గురయినప్పుడు ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది.



    సాధారణంగా వర్షాకాలం ప్రారంభయ్యే సమయం, వాతావరణంలో తడి ఎక్కువగా ఉన్న సమయంతోపాటు చిత్తడిగా ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాపించడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందువల్ల రానున్న మూడు నెలలు ఈ వ్యాధి పట్ల  అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గర్లోని ఆస్పత్రులకు వెళ్లి రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని చూచించారు.



    మరోవైపు స్వైన్‌ఫ్లూ బారిన పడిన వారికి చికిత్స చేయడానికి వీలుగా తాలూకా ఆస్పత్రుల్లో ఐదు పడకలను, జిల్లా ఆస్పత్రిలో పది పడకలను మూడు నెలల పాటు రిజర్వ్‌గా ఉంచాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఇప్పటికే ఆయా జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ రాష్ట్రం మొత్తం మీద పది స్వైన్‌ఫ్లూ మరణాలు సంభవించగా అందులో ఒక్క ఉడిపి జిల్లాలోనే నలుగురు చనిపోయారు.



    దీంతో ఒకే ప్రాంతం నుంచి ఐదు అంత కంటే ఎక్కువ స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయితే జిల్లా వైద్యాధికారి నేతృత్వంలో వైద్యులు ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి ప్రజలందరికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాల్సిందిగా కూడా వైద్య శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మధుమేహం, ఆస్మా, ఉబకాయం (ఒబేసిటీ)తో బాధపడుతున్న వారితో పాటు గర్భిణులకు త్వరగా ఈ వైరస్ సోకే అవకాశముంది. అందువల్ల వీరు ఈ వ్యాధి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

     

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top