‘లాటరీ’పై రాజ్‌భవన్ కన్నెర్ర | Single-number lottery dispute | Sakshi
Sakshi News home page

‘లాటరీ’పై రాజ్‌భవన్ కన్నెర్ర

May 26 2015 5:58 AM | Updated on Sep 3 2017 2:44 AM

రాష్ట్ర రాజకీయాలతో పాటు ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న సింగిల్ నంబర్ లాటరీ వివాదంపై గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా సీరియస్ అయ్యారు.

- దర్యాప్తుపై నివేదిక ఇవ్వండి
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ
సాక్షి, బెంగళూరు: 
రాష్ట్ర రాజకీయాలతో పాటు ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న సింగిల్ నంబర్ లాటరీ వివాదంపై గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా సీరియస్ అయ్యారు. ఈ విషయమై సంపూర్ణ నివేదికతోపాటు దర్యాప్తు జరుగుతున్న తీరుపై  నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌషిక్ ముఖర్జీకి లేఖ రాశారు. రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా కుంగదీసేందుకు కారణమైన లాటరీ వి వాదంలో ఐజీపీ, ఎస్పీ క్యాడర్ అధికారుల హస్తం ఉండ డం పట్ల తాను తీవ్ర కలత చెందినట్లు వజుభాయ్ రుడాభాయ్‌వాలా తన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఐపీఎస్ స్థాయి అధికారులైన అలోక్‌కుమార్‌తో పాటు ఎస్పీ ధరణీష్ సస్పెండ్ కావడానికి దారితీసిన పరిస్థితుల పట్ల సమగ్ర వివరణను నివేదికలో పేర్కొనాలని వజుభాయ్ రుడాభాయ్ వాలా లేఖలో ఆదేశించారు. ఆ లేఖ అందుకున్న   కౌషిక్ ముఖర్జీ సోమవారం రాత్రి గవర్నర్‌కు నివేదిక సమర్పించారు.

సీబీఐకి అప్పగించేది లేదు
సింగిల్ నంబర్ లాటరీ వివాదానికి సంబంధించిన కేసు సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మీడియాతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. సింగిల్ నంబర్ లాటరీ విషయంలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉండడం వల్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ స్వయం ప్రేరితంగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే తమకు అభ్యంతరం లేదని వివరణ ఇచ్చారు. ‘మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అమర్యాదగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అక్రమ లాటరీ దందా మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచే యథేచ్ఛగా సాగుతోంది. అంతేకాదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లాటరీ వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు నష్టపోతున్న విషయం తెలుసుకుని సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాం.

ఈ విషయాలన్నీ మరిచి కుమారస్వామి అనవసర ఆరోపణలు చేస్తున్నారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ నుంచి పూర్తి స్థాయి నివేదిక అందిన తర్వాత అక్రమాలకు పాల్పడినవారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని జార్జ్ పేర్కొన్నారు. తనతోపాటు సిద్ధరామయ్య ఈ అక్రమాల్లో భాగస్వాములని పేర్కొన్న కుమారస్వామి, ఆధారాలుంటే బహిర్గతం చేయాలని సవాలు విసిరారు. లాటరీ దందా నియంత్రణ కోసం ఏర్పాటైన ‘అబ్కారీ, లాటరీ విజిలెన్స్ వింగ్’ను ఇప్పటికే రద్దు చేశామని కే.జే జార్జ్ గుర్తుచేశారు. అయితే లాటరీ, మట్కా దందాలను అరికట్టడానికి వీలుగా ఎస్పీ నేతృత్వంలో పనిచేసే జిల్లా అపరాధ నియంత్రణా దళం (డీసీబీ)ను ఏర్పాటు చేశామన్నారు. బెంగళూరులోని సీసీబీ మాదిరీ ఈ విభాగం పనిచేస్తున్నారు. డీసీబీ ఎక్కడైనా దాడులు చేసి మట్కా, లాటరీ దందాలను గుర్తిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారిని ఇందుకు బాధ్యున్ని చేసి చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని కే.జే జార్జ్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement