ప్రముఖ గాయకుడు నాగూర్ హనీఫా(97) చెన్నైలో అస్తమించారు. ఆయన మరణ సమాచారంతో
సాక్షి, చెన్నై:ప్రముఖ గాయకుడు నాగూర్ హనీఫా(97) చెన్నైలో అస్తమించారు. ఆయన మరణ సమాచారంతో డిఎంకే అధినేత ఎం కరుణానిధి ఉద్వేగానికి లోనయ్యారు. నాగూర్ దర్గా ఆవరణలోని ముస్లీం సామాజిక వర్గ శ్మశాన వాటికలో హనీఫా మృత దేహాన్ని ఖననం చేశారు.
‘నాగూర్ హనీఫా’ ఈ పేరు వింటే తమిళనాట ఉన్న ముస్లీం సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ఆనంద డోలికల్లో తేలియాడుతారు. ఆయన గ ళం వీనూల విందు. ముస్లీం సామాజిక వర్గానికి సంబంధించిన అనేకానేక భక్తి గీతాలను ఆయన ఆలపించారు. ఆయన పాడిన వందలాది పాటల్లో ఒక్కో పాట ఒక్కో మదురం. ముస్లీంల వివాహ వేడుకకు అర్థాన్ని ఇస్తూ ఆయన పాడిన పాట ప్రతి వివాహ వేడుకలో తప్పని సరిగా మోగాల్సిందే.అలాగే, డిఎంకేకు ఆయన తీవ్ర విధేయుడు. డిఎంకే కోసం ఆయన ఆలపించిన గీతాలు ఎన్నో.
డిఎంకే సభలు, సమావేశాలు, ర్యాలీల్లో హనిఫా పాడిన పాటలు తప్పని సరిగా విన్పించి తీరుతాయి. ప్రఖ్యాత గాయకుడిగా పేరు గడించిన హనీఫా కొన్ని తమిళ, ఇస్లాం సంబంధిత చిత్రాలకు సైతం తన గాత్రాన్ని అందించారు. డిఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై అస్తమించినప్పుడు ‘ ఎక్కడికి వెళ్లావో...’ అన్న పాట ప్రతి హృదయాల్నికదిలించక తప్పలేదు. అలాగే, డిఎంకే అధినేత ఎం కరుణానిధిని స్తుతిస్తూ కొన్ని పాటలను ఆలపించిన హనీఫాకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఓ కుమారుడు నవ్‌షత్ తండ్రి బాటలో నడిచి గాయకుడు అయ్యారు.
హనీఫా కన్నుమూత: వయో భారంతో ఉన్న హనీఫా సతీమణి ఇటీవల అస్తమించారు. ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలతో కలసి ఒకే ఇంట్లో ఆయన నివాసం ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి చెన్నైలోని కొట్టూరు పురంలో నివాసంలో హనీఫా తుది శ్వాస విడిచారు.ఆయన మరణ సమాచారంతో డిఎంకే అధినేత ఎం కరుణానిధి ఉద్వేగానికి లోనయ్యారు. కరుణానిధి,పార్టీ కోశాధికారి ఎంకే స్టాలి న్,ఎంపి కనిమొళి, నేతలు రాజ తదితరులు కొట్టూరు పురంకు చేరుకున్నారు. హనీఫా భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సమయంలో హనీఫా భౌతిక కాయాన్ని తీక్షణంగా చూస్తూ కరుణానిధి ఉద్వేగానికి లోనయ్యారు.
నాగూర్‌కు తరలింపు: నాగూర్ హనీఫా భౌతిక కాయాన్ని గురువారం ఉదయాన్నే ఆయన స్వగ్రామం నాగూర్‌కు తరలించారు. ప్రత్యేక అంబులెన్స్‌లో నాగపట్నం జిల్లా నాగుర్‌కు చేరుకున్న ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. అక్కడి నూర్ షా తైకాల్ వీధిలోని సొంత ఇంటిలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. ఆప్తులు, బంధువుల సందర్శనానంతరం సాయంత్రం సంప్రదాయ పద్దతిలో ఊరేగింపుగా నాగర్ దర్గా ఆవరణకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక ప్రార్ధన అనంతరం ముస్లీంల స్మశాన వాటికలో వారి సంప్రదాయ బద్దంగా భౌతిక కాయాన్ని ఖననం చేశారు.