దోషులే | Shakti Mills gang-rape cases: Five adults convicted, two juveniles yet to be tried | Sakshi
Sakshi News home page

దోషులే

Mar 20 2014 10:24 PM | Updated on Sep 3 2019 8:44 PM

గతేడాది శక్తి మిల్లు కంపౌండ్‌లో జరిగిన రెండు అత్యాచార కేసుల్లో స్థానిక కోర్టు ఐదుగురు నిందితులను దోషులుగా ప్రకటించింది.

సాక్షి, ముంబై: గతేడాది శక్తి మిల్లు కంపౌండ్‌లో జరిగిన రెండు అత్యాచార కేసుల్లో స్థానిక కోర్టు ఐదుగురు నిందితులను దోషులుగా ప్రకటించింది. గతేడాది ఆగస్టు 22న జరిగిన మహిళా ఫొటోజర్నలిస్ట్, జూలై 31న జరిగిన కాల్‌సెంటర్ ఉద్యోగిపై సామూహిక అత్యాచారం కేసుల్లో వీరికి  శుక్రవారం శిక్ష ఖరారు చేయనుంది. విజయ్ జాదవ్, క్వాసీమ్ హాఫీజ్ షేక్ అలియాస్ బెంగాలీ, మహమ్మద్ సలీం అన్సారీలను రెండు కేసుల్లో దోషులుగా కోర్టు గుర్తించింది. మహిళా ఫొటో జర్నలిస్ట్ అత్యాచారం కేసులో సిరాజ్ ఖాన్, కాల్ సెంటర్ ఉద్యోగి కేసుల్లోనూ అస్ఫక్వి షేక్‌లను దోషులుగా ప్రకటించింది. ఈ రెండు కేసులపై ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి శాలిని పాన్‌సల్కర్ జోషి శుక్రవారం తీర్పును వెలువరించనున్నారు.

 గతేడాది ఆగస్టు 22వ తేదీన శక్తిమిల్లు కంపౌండ్‌లో ఓ మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. దీనిపై ముంబైతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు బాధితురాలు అందించిన ఆధారాల మేరకు నిందితులు విజయ్ జాదవ్, కాసీమ్ బంగాలీ, సలీం అన్సారీ, సిరాజ్ రెహమాన్‌తోపాటు మరో మైనర్ బాలున్ని  అరెస్టు చేశారు. ఆ తర్వాత విచారించగా మరో టెలిఫోన్ ఉద్యోగిని కూడా  అత్యాచారం చేసినట్టు తెలిపారు.

ఈ రెండు కేసులలో నిందితులు ఒక్కరే కావడంతో విచారణ ఒకేసారి సంయుక్తంగా చేపట్టారు.  2013 సెప్టెంబర్ 19న మహిళా ఫొటో జర్నలిస్ట్ కేసులో నిందితులపై 600 పేజీల చార్జీషీట్‌ను, టెలిఫోన్ ఆపరేటర్ అత్యాచారం కేసులో నిందితులపై 362 పేజీల చార్జీషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. ఈ కేసు 2013 సెప్టెంబర్ 23న సెషన్స్ కోర్టులో న్యాయమూర్తి శాలిని జోషీ ముందు విచారణకు వచ్చింది. మహిళా ఫొటో జర్నలిస్ట్ కేసులో 44 మంది సాక్షులు, ఆపరేటర్ కేసులో 31 మంది సాక్షులను విచారించారు. అందరి వాదనలు విన్న అనంతరం కోర్టు గురువారం నిందితులను దోషులుగా ప్రకటించింది. అయితే ఈ రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ మైనర్ బాలుడిని జువైనల్ కోర్టు త్వరలో విచారించనుంది. కాగా, గురువారం జరిగిన కోర్టు విచారణకు రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ హాజరయ్యారు.

 కఠిన శిక్షను విధించాలి..  
 ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ ఉజ్వల్ నికమ్ మహిళలపై అత్యాచారానికి పాల్పడేవారికి కఠినమైన శిక్షను విధించాలని కోర్టును కోరారు. ఈ కేసుల్లో నిందితులను దోషులని న్యాయస్థానం ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. వారికి కఠినమైన శిక్షను విధించాలన్నారు. మరోవైపు మైనర్ నిందితునిపై కేసు విచారణ తొందర్లోనే ప్రారంభం కానుందని చెప్పారు.

 గుణపాఠం కావాలి: పాటిల్
 ఈ కేసు తీర్పు తొందరగా వెలువడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని, దీంతో చాలా తక్కువ సమయంలోనే దర్యాప్తు పూర్తయిందని హోంశాఖ మంత్రి ఆర్ ఆర్ పాటిల్ పేర్కొన్నారు. కోర్టుకు వచ్చిన ఆయన కేసుల విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడేందుకు సాహసం చేయకుండే ఉండేందుకు నిందితులకు కఠిన శిక్ష విధించాలన్నారు. ఇది  నిందితులందరికి ఒక గుణపాఠంగా మారాలని అభిప్రాయపడ్డారు. కోర్టు ఇచ్చే తీర్పుతో నింది తులు ఇలాంటి సంఘటనలకు పాల్పడేందుకు సాహసించరన్నారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు మహిళలెవరైనా పోలీసుల మద్దతు తప్పక తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాధితురాలికి న్యాయం జరిగేది ప్రత్యక్షంగా చూసేందుకు కోర్టుకు వచ్చినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement