నెచ్చెలి.. నిజం చెప్పాలి!

Sasikala Investigation With Video Conference In jayalalithaa Case - Sakshi

అమ్మ మరణంలో చిన్నమ్మ పాత్ర శశికళ సాక్ష్యమే ముఖ్యం

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శశికళ విచారణ

డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, మంత్రి విజయభాస్కర్‌లకు త్వరలో సమన్లు

దివంగత ముఖ్యమంత్రి జయలలిత విచారణ కమిషన్‌ నిర్ణయం

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ముసురుకున్న అనుమానపు మేఘాలను తొలగించేందుకు ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్‌ వేగం పెంచింది. జయ నెచ్చెలి శశికళ నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టాలని ఆశిస్తోంది. డెప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, ఇతర మంత్రుల నుంచి వాంగ్మూలాన్ని సేకరించాలని కమిషన్‌ నిర్ణయించింది. రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆర్ముగస్వామి నేతృత్వంలో ఏర్పాటైన విచారణ కమిషన్‌ గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి రంగంలోకి దిగింది. ఈ ఏడాది అక్టోబర్‌ 24వ తేదీతో కమిషన్‌ పదవీకాలం ముగుస్తుంది. ఇప్పటి వరకు జయలలిత బంధువులు, శశికళ బంధువులు, వారి సహాయకులు, ప్రభుత్వ విధుల్లో జయకు సహకరించిన అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, జయకు చికిత్స చేసిన అపోలో, ఎయిమ్స్‌ వైద్యులు, ప్రభుత్వ డాక్టర్లు ఇలా సుమారు వందమందికి పైగా సాక్షులను విచారించినా ఇంకా విచారణ ముగియలేదని అంటున్నారు.

ముఖ్యంగా శశికళ బంధువులు, వైద్యులు చెప్పిన వివరాలు పొంతనలేనివిగా ఉండడంతో కమిషన్‌ అనుమానిస్తోంది. జయ మరణంపై సందేహాన్ని వ్యక్తం చేస్తోంది. జయలలితకు అందరికంటే అత్యంత సన్నిహితురాలైన శశికళ పాత్ర, శశికళ సలహాలు, సూచనల ప్రకారమే జయలలితకు చికిత్స అందడం, అపోలోలో చేర్చిన నాటి నుంచి అంతిమ సంస్కారం ముగిసే వరకు అన్నీ తానై చూసుకోవడాన్ని కమిషన్‌శితంగా పరిశీలిస్తోంది. జయ మరణంపై శశికళను ముఖ్యమైన సాక్షిగా భావిస్తోంది. శశికళ చెప్పే విషయాలు కీలకంగా మారగలవని అంచనావేస్తోంది. ఈ కారణంగా శశికళను విచారించాలని కమిషన్‌ నిర్ణయించింది. అయితే శశికళ ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. విచారణ నిమిత్తం అమెను చెన్నైకి పిలిపించుకుంటే అనేక చట్టపరమైన చిక్కులను అధిగమించాల్సి వస్తుందని కమిషన్‌ అభిప్రాయపడుతోంది. ఈ కారణంగా వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టాలని నిర్ణయించింది.

అలాగే జయకు చికిత్స చేసిన సింగపూర్‌ డాక్టర్లను సైతం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టనున్నారు. శశికళను విచారించిన తరువాత ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, వైద్యమంత్రి విజయభాస్కర్‌లను సైతం విచారించాలని కమిషన్‌ నిర్ణయించింది. ఇందుకోసం వారిద్దరికీ సమన్లు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరిద్దరితోపాటు మంత్రులు తంగమణి, వేలుమణి, లోక్‌సభ ఉపసభాపతి తంబిదురైలను కూడా విచారించనుంది. అవసరమైతే అపోలో ఆసుపత్రి వైద్యులను మరోసారి పిలిపించుకోవాలని భావిస్తోంది. అనేక ముఖ్యులను విచారించాల్సి ఉన్నందున కమిషన్‌ గడువు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top