తెలుగు వారికి సదా రుణపడి ఉంటా..!


వారి మద్దతుతోనే ఎమ్మెల్యేనయ్యా: రూపేశ్ మాత్రే

భివండీ, న్యూస్‌లైన్: భివండీ పట్టణం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడానికి తెలుగువారి మద్దతే కారణమని శివసేనకు చెందిన స్థానిక శాసనసభ్యులు రూపేశ్ మాత్రే పేర్కొన్నారు. తెలుగువారికి సదా రుణపడి ఉంటానని, అలాగే మీరు కూడా నాపై ఆదరాభిమానాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష పద్మశాలి సమాజం వారు శనివారం ఇక్కడ ముగ్గురు శాసనసభ్యులకు, పవర్‌లూమ్ డెవలప్‌మెంట్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన వంగ పురుషోత్తంకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.



ఈ సందర్భంగా రూపేశ్ మాత్రే మాట్లాడుతూ, తెలుగువారికి తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని చెప్పారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయలేకపోయానని, ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కూడా తమ పార్టీ భాగస్వామిగా ఉందని అన్నారు. ఈ ప్రాంతంలో ఓ ఆట స్థలం ఏర్పాటుకు ప్రయత్నిస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలకు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పవర్‌లూమ్ కార్మికులు కూడా లబ్ధి పొందే రీతిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

బీజేపీ ఎమ్మెల్యే మహేష్ చౌగులే మాట్లాడుతూ, బాల్యం నుంచి ఇప్పటివరకు తెలుగు వారితోనే సహవాసం చేశానని, భాషా బేధాలు లేకుండా వారితో కలిసిపోయానన్నారు. తెలుగువారికి తనవంతుగా అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షుడు కముటం శంకర్ మాట్లాడుతూ, ఈ సమాజం స్థాపించినప్పటి నుంచి రాజకీయంగా ఎదుగుతూ వస్తూ గతంలో కార్పొరేషన్‌లో కూడా ప్రాతినిధ్యం వహించామని చెప్పారు.



గతంలో సమాజం తరఫున ఏడుగురు కార్పొరేటర్లు గెలిచారని, ఇప్పుడ ఆ సంఖ్య ఒకటికి చేరిందని అన్నారు. సమైక్యంగా ఉంటే సమాజం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా శివసేన రూరల్ ఎమ్మెల్యే శాంతారామ్ మోరే, అఖిల పద్మశాలి సమాజ్ కార్యాధ్యక్షుడు వేముల నర్సయ్య, సహాయ కార్యదర్శి వంగ పురుషోత్తం, కోశాధికారి పాశికంటి లచ్చయ్య, ఈశ్వర్ ఆడెపుతో పాటు సమాజ పెద్దలు పాల్గొన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top