breaking news
Rupesh Mhatre
-
తెలుగు వారికి సదా రుణపడి ఉంటా..!
వారి మద్దతుతోనే ఎమ్మెల్యేనయ్యా: రూపేశ్ మాత్రే భివండీ, న్యూస్‌లైన్: భివండీ పట్టణం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడానికి తెలుగువారి మద్దతే కారణమని శివసేనకు చెందిన స్థానిక శాసనసభ్యులు రూపేశ్ మాత్రే పేర్కొన్నారు. తెలుగువారికి సదా రుణపడి ఉంటానని, అలాగే మీరు కూడా నాపై ఆదరాభిమానాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష పద్మశాలి సమాజం వారు శనివారం ఇక్కడ ముగ్గురు శాసనసభ్యులకు, పవర్లూమ్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన వంగ పురుషోత్తంకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రూపేశ్ మాత్రే మాట్లాడుతూ, తెలుగువారికి తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని చెప్పారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయలేకపోయానని, ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కూడా తమ పార్టీ భాగస్వామిగా ఉందని అన్నారు. ఈ ప్రాంతంలో ఓ ఆట స్థలం ఏర్పాటుకు ప్రయత్నిస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలకు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పవర్లూమ్ కార్మికులు కూడా లబ్ధి పొందే రీతిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే మహేష్ చౌగులే మాట్లాడుతూ, బాల్యం నుంచి ఇప్పటివరకు తెలుగు వారితోనే సహవాసం చేశానని, భాషా బేధాలు లేకుండా వారితో కలిసిపోయానన్నారు. తెలుగువారికి తనవంతుగా అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షుడు కముటం శంకర్ మాట్లాడుతూ, ఈ సమాజం స్థాపించినప్పటి నుంచి రాజకీయంగా ఎదుగుతూ వస్తూ గతంలో కార్పొరేషన్లో కూడా ప్రాతినిధ్యం వహించామని చెప్పారు. గతంలో సమాజం తరఫున ఏడుగురు కార్పొరేటర్లు గెలిచారని, ఇప్పుడ ఆ సంఖ్య ఒకటికి చేరిందని అన్నారు. సమైక్యంగా ఉంటే సమాజం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా శివసేన రూరల్ ఎమ్మెల్యే శాంతారామ్ మోరే, అఖిల పద్మశాలి సమాజ్ కార్యాధ్యక్షుడు వేముల నర్సయ్య, సహాయ కార్యదర్శి వంగ పురుషోత్తం, కోశాధికారి పాశికంటి లచ్చయ్య, ఈశ్వర్ ఆడెపుతో పాటు సమాజ పెద్దలు పాల్గొన్నారు. -
పక్కా ఇళ్లపట్టాలు ఇప్పిస్తా..
శివసేన సిట్టింగ్ ఎమ్మెల్యే రూపేష్ మాత్రే భివండీ, న్యూస్‌లైన్: కొన్నేళ్లుగా ప్రభుత్వ స్థలాల్లో స్థిరనివాసాలు ఏర్పాటుచేసుకున్న తెలుగు, మరాఠి, ఉత్తరాది ప్రజలకు పక్కా ఇంటి నంబర్లు ఇప్పిస్తానని రూపేష్ మాత్రే హామీ ఇచ్చాడు. కామత్‌ఘర్,పేనాగావ్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాత్రే మాట్లాడుతూ తూర్పు భివండీ నియోజక వర్గ పరిధిలోని కామత్‌ఘర్, పేనాగావ్, గణేష్‌నగర్, భాగ్యనగర్, ఆశీర్వాద్‌నగర్, పద్మనగర్‌లో నివాసముంటున్న కార్మిక కుటుంబాలన్నింటికీ గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అఖిల పద్మశాలి సమాజ్ అధ్యక్షుడు కముటం శంకర్ మాట్లాడుతూ......తెలుగు ప్రజలకు అండగా ఉంటున్న మాత్రేను గెలిపించుకోవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంద న్నారు. ఈ సభలో స్థానిక శివసేన కార్పొరేటర్లు తుషార్ చౌదరి, కమలాకర్ పాటిల్, మదన్ బువ్వా, పూనం పాటిల్, దిలీప్ గుల్వీ, అరుణ్ రాహుత్, సుందర్ నాయిక్‌తో భారీసంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.