అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు తమ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు.
పింప్రి, న్యూస్‌లైన్: అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు తమ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రెండు నెలల్లోగా ఆర్డినెన్స్‌ను తీసుకొస్తామన్నారు. చికిలీలో నిర్మించిన గృహ సముదాయాలను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పింప్రి-చించ్‌వడ్, పుణే శివారు ప్రాంతాలలో అక్రమ కట్టడాలను కొనసాగించే అంశంపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని నియమించామన్నారు.
నగరంలో అక్రమ కట్టడాల సంఖ్య ఎంత వాటిలో ఎన్నింటిని కొనసాగించవచ్చు? అందువల్ల ఎంతమందికి న్యాయం జరుగుతుంది? తదితర అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిస్తుందన్నారు. నివేదిక అందిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు సంబంధించి చట్టాల్లో మార్పులుచేర్పులపై శాసనసభ్యులందరితోనూ చర్చిస్తామన్నారు. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు సంబంధించి ఏ చిన్న అవకాశం వచ్చినా వదలనంటూ నగరవాసులకు భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిజా వ్యాస్, ఉపముఖ్య మంత్రి అజిత్ పవార్, శివసేన ఎంపీలు శివాజీరావ్, అడల్‌రావ్‌పాటిల్, గజానన్ బాబర్, ఎమ్మెల్యేలు విలాస్ లాండే, చంద్రకాంత్, కేంద్రీయ గృహనిర్మాణ, నగర దారిద్య్ర నిర్మూలన విభాగం కార్యదర్శి అరుణ కుమార్ మిశ్రా, నగర మేయర్ మోహినీ లాండే, ఉపమేయర్ రాజు మిసాల్, మంగళా కదమ్ తదితరులు పాల్గొన్నారు.