మరోసారి వడ్డన | Sakshi
Sakshi News home page

మరోసారి వడ్డన

Published Sat, Sep 7 2013 3:52 AM

Power Utilities Warn of Looming Price Hike in maharashtra

సాక్షి, ముంబై: రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసే సంస్థలు (డిస్కమ్‌లు) ‘మహానిర్మితి’, ‘మహాపారేషణ్’ 2010 నుంచి విద్యుత్‌శాఖకు (మహావితరణ) చెల్లించాల్సిన బకాయిలు వసూలు చేసేందుకు మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (ఎంవీఆర్సీ) అనుమతి ఇచ్చింది. దీంతో ఈ రెండు డిస్కమ్‌ల అధీనంలో ప్రాంతాల వినియోగదారులపై అదనపు భారం తప్పకపోవచ్చు.  మహానిర్మితి, మహాపారేషణ్ విద్యుత్‌శాఖకు సుమారు రూ.3,686 కోట్లు బకాయి పడ్డాయి. వీటిని వసూలు చేసేందుకు అనుమతి లభించడంతో ఈ మొత్తాన్ని వినియోగదారుల ద్వారా రాబట్టనుంది.
 
 ఫలితంగా ఇక నుంచి యూనిట్‌కు 80-90 పైసల చొప్పున అదనంగా వసూలు చేస్తారు. ముంైబె కర్లకు విద్యుత్ సరఫరాచేస్తున్న ‘బెస్ట్’ సంస్థ సెప్టెంబరు నుంచి చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహావితరణ రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులపై చార్జీల భారం మోపుతోంది. ఇందులో దాదాపు 1.20 కోట్ల మందికిపైగా వినియోగదారులు 100-300 యూనిట్లు వాడేవారున్నారు. పెరిగిన చార్జీల వల్ల 100 యూనిట్లు వాడే వారికి నెలకు అదనంగా రూ.90 భారం పడనుంది. మహానిర్మితి, మహాపారేషణ్‌కు బకాయిలు వసూలు చేసేందుకు మొదట్లోనే అనుమతి ఇచ్చినట్లయితే వినియోగదారులపై ఇప్పుడు ఈ భారం పడేది కాదని అంటున్నారు. సదరు కంపెనీలు ఏళ్ల తరబడి విద్యుత్ చార్జీలు పెంచడం లేదు. ఎంవీఆర్సీ అనుమతివ్వడంతో చార్జీల భారం మోపేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. దీంతో వినియోగదారులపై ఒకేసారి పెద్ద ఎత్తున అదనపు భారం పడుతుందని అంటున్నారు. ఎప్పటికప్పుడు విద్యుత్ చార్జీలు పెంచితే యూనిట్‌కు 20-30 పైసల చొప్పున భారం పడేది. కాని ఏకంగా యూనిట్‌కు 90 పైసలు పెంచడంతో 200-300 యూనిట్లు వాడేవారికి ఏకంగా నెలకు అదనంగా రూ.250 వరకు బిల్లు వచ్చే ఆస్కారం ఏర్పడింది.
 
 సీఎన్జీ ధరలు కూడా
 విద్యుత్ చార్జీలకు సీఎన్జీ తోడయింది. ఇటీవలే భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఫలితంగా అన్ని నిత్యావసర వస్తువుల ధరలూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి సీఎన్జీ ధరలు పెరిగాయి.  కిలో సీఎన్జీ ధరను రూ.మూడు చొప్పున పెంచుతున్నట్టు సంబంధిత అధికారులు శుక్రవారం ప్రకటించారు.
 
 కొత్త ధరల వివరాలిలా ఉన్నాయి.
 ముంబై: రూ. 38.95
 ఠాణే:    రూ. 39.69
 నవీముంబై:    రూ. 39.44
 

Advertisement

తప్పక చదవండి

Advertisement