
ఐస్‌బాక్స్‌లో ఉంచిన పెంపుడుకుక్క కళేబరం వద్ద సుజాత
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాటరాకుంటే ఏమి.. మనిషి కంటే విశ్వాసమున్నదానినని చాటుకుంది. మనుషుల్లో మనిషిలా కలిసిపోయి హృదయంలో స్థానం సంపాదించుకుంది. కుటుంబంలో ఒక సభ్యునిలా ప్రేమ పంచుకున్న పెంపుడు కుక్క మరణించగా బాధతో విలవిలలాడిపోయిన ఆ కుటుంబం ఎంతో గొప్పగా అంత్యక్రియలు నిర్వహించి తమ ఔదార్యాన్ని చాటుకున్న సంఘటన పుదుచ్చేరిలో జరిగింది. పుదుచ్చేరి కోరిమేడుకు చెందిన దేవరాజ్ టెంపోడ్రైవర్, ఇతని భార్య సుజాత.
వీరికి ఇద్దరు కుమారులున్నారు. కుమార్తె లేదనే లోటును తీర్చుకునేందుకు 12 ఏళ్ల క్రితం ఒక చిన్న ఆడకుక్కను తెచ్చుకుని జాకీ అనే పేరుపెట్టి ప్రేమగా పెంచుకుంటున్నారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న జాకీకి చికిత్సలు చేయించినా కోలుకోలేక సోమవారం ప్రాణాలు విడిచింది.పనిపై రెండురోజులుగా తిరుపతిలో ఉంటున్న దేవరాజ్‌కు భార్య సమాచారం ఇవ్వగా తాను వచ్చేవరకు జాకీని ఐస్‌బాక్స్‌లో ఉంచమని భార్యాబిడ్డలకు చెప్పి హుటాహుటిన మంగళవారం పుదుచ్చేరికి చేరుకున్నాడు. జాకీ మరణాన్ని తట్టుకోలేక కుటుంబమంతా కన్నీరుమున్నీరైంది. మనిషి మరణం తరువాత చేయాల్సిన సంప్రదాయాలన్నీ జాకీకి చేసిన దేవరాజ్ తన సొంత స్థలంలో జాకీని ఖననం చేశారు.