ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న ఉల్లిగడ్డల ధరలు రెండు వారాల్లో అదుపులోకి వస్తాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ తెలిపారు.
రెండు వారాల్లో ఉల్లి ధరలు తగ్గుతాయి: పవార్
Aug 17 2013 11:13 PM | Updated on Sep 1 2017 9:53 PM
సాక్షి, ముంబై: ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న ఉల్లిగడ్డల ధరలు రెండు వారాల్లో అదుపులోకి వస్తాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ తెలిపారు. శుక్రవారం పండరీపూర్‌కు వచ్చిన శరద్ పవార్ ఉజనీ జలాశయాన్ని దర్శించి జలపూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఉజనీ జలాశయంలోని నీరు జిల్లాలో ఉన్న ఎన్ని చెరువుల్లోకి వదలడం వీలవుతుందనే దానిపై పర్యవేక్షిస్తామన్నారు. ఆ తర్వాత వివిధ చెరువుల్లో నీటిని నిల్వ చేయడం కోసం స్థిర కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. భూగర్భంలోని నీటి మట్టం పెంచడం కోసం ప్రయత్నించాలని సూచించారు. ‘డిమాండ్ కన్నా సరఫరా తక్కువగా ఉండటంతో ఉల్లిగడ్డల ధరలు పెరిగిపోతున్నాయి.
ఈ పరిస్థితి మరో రెండు వారాలు కొనసాగే అవకాశముంది. ఆ తర్వాత వీటి ధరలు తగ్గుతాయ’ని ఆయన అన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పంట పండించిన రైతన్నకు ప్రస్తుతం మంచి లాభం వస్తోందన్నారు. ‘రెండు వారాల తర్వాత తమిళనాడులో ఉల్లిగడ్డలు మార్కెట్‌లోకి వస్తాయి. ఆ తర్వాత గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని మార్కెట్లకు రానున్నాయి. దీంతో అన్ని మార్కెట్లలో ఉల్లిగడ్డల ధరలు తగ్గుతాయ’ని తెలిపారు. అయితే ఏ రాష్ట్రం ఉల్లిగడ్డలు కొనుగోలు చేయడానికి సిద్ధమవుతుందో ఆ రాష్ట్రానికి సరఫరా చేస్తామని పవార్ స్పష్టం చేశారు.
Advertisement
Advertisement