
ప్రశ్నపత్రంలో రోప్‌కు బదులు రేప్ పడింది
ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు బోధిస్తున్న పాఠ్యాంశాల్లో తప్పుల తడకలు ఇటీవల కాలంగా పెరుగుతూ వస్తున్నాయి.
చెన్నై : ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు బోధిస్తున్న పాఠ్యాంశాల్లో తప్పుల తడకలు ఇటీవల కాలంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా రోప్ అన్న పదాన్ని రేప్‌గా తీర్చిదిద్దిన వైనం కన్యాకుమారిలో వెలుగు చూసింది. రాష్ర్టంలో అమల్లో ఉన్న విద్యా విధానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే, ప్రైవేటు పాఠశాలల్లో నిర్బంధ తమిళం అమల్లో ఉంది.
ఇక ఇతర సబ్జెక్టుల్లోకి వెళితే పాఠ్యాంశాలు ఒకే విధంగా ఉన్నా, విద్యా బోధన పరంగా ఒక్కో పాఠశాలది ఒక్కో స్టైల్. ఇక, స్లిప్ టెస్టు, యూనిట్ టెస్టులు అంటూ విద్యార్ధుల నెత్తిన తమ బోధనల్ని రుద్దేస్తుంటారు. అదే సమయంలో పాఠ్య పుస్తకాల్లో గానీయండి, ప్రశ్నా పత్రాల్లో గానీయండి తరచూ తప్పుల తడకను విద్యార్థులు ఎదుర్కొనక తప్పదు. ఈ పరిస్థితుల్లో అక్షరాలు మారితే అర్థాలే మారుతాయని కూడా తెలియని రీతిలో ప్రశ్నాపత్రాన్ని రూపొందించి ఉండడం కన్యాకుమారిలో వెలుగు చూసింది.
రోప్ ..రేప్: కన్యాకుమారిలో అన్ని స్కూల్స్‌కు ఇటీవల యూనిట్ టెస్టులు జరిగాయి. మరో నాలుగు రోజుల్లో క్వార్టర్లీ పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఈ పరిస్థితుల్లో యూనిట్ టెస్టుకు సిద్ధం చేసి విద్యార్థులకు అందజేసిన ప్రశ్నాపత్రం బయట పడింది. ఇందులో రోప్‌ను రేప్‌గా తీర్చిదిద్ది ముద్రించి ఉండటం గమనార్హం. పదో తరగతి సైన్స్ పరీక్షలో పార్ట్-4లో 33వ ప్రశ్నగా దీనిని ముద్రించి ఉన్నారు.
మంచు కొండల్లో రోప్ సాయంతో ఇద్దరు పాకుతూ...అన్నట్టుగా సంధించిన ఈ ప్రశ్నలో రోప్(తాడు) అన్న పదం ఉండాల్సిన చోట రేప్( అత్యాచారం) అన్ని ఆంగ్లంలో ముద్రించి ఉండడం బట్టి చూస్తే దానిని రూపొందించిన విద్యా నిపుణులు ఏ మేరకు మేధావులుగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఒక చోట కాదు, రెండు మూడు చోట్ల రోప్ అన్న పదానికి బదులుగా రేప్..రేప్. రేప్ అని వాడి ఉండడం గమనించాల్సిన విషయం. యూనిట్ టెస్టు ప్రశ్నాపత్రాల్ని క్వార్టర్లీ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఉపయోగ పడే విధంగా ప్రత్యేక క్లాస్‌లు ఇచ్చే క్రమంలో ఈ రేప్ బయట పడింది. అయితే, యూనిట్ టెస్టు రాసిన విద్యార్థులు సమాధానం ఇచ్చే క్రమంలో రోప్‌గా భావించారో లేదా రేప్‌గానే రాశారోనన్నది ప్రశ్నార్థకమే. దీంతో వాట్సాప్‌లలో విద్యా నిర్వాహకుల తీరుపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు హల్ చల్ చేయడం మొదలెట్టాయి.