శివకాశిలో భారీ పేలుడు | Massive explosion at Sivakasi | Sakshi
Sakshi News home page

శివకాశిలో భారీ పేలుడు

Aug 23 2013 4:42 AM | Updated on Sep 1 2017 10:01 PM

శివకాశిలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఇక్కడ బాణసంచాకు చెందిన రెండు పరిశ్రమల్లో మంటలు చెలరేగాయి. 20 గదులు నేల మట్టమయ్యాయి. ఆ సమయంలో సిబ్బంది మధ్యాహ్న భోజనానికి వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది.

శివకాశిలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఇక్కడ బాణసంచాకు చెందిన రెండు పరిశ్రమల్లో మంటలు చెలరేగాయి. 20 గదులు నేల మట్టమయ్యాయి. ఆ సమయంలో సిబ్బంది మధ్యాహ్న భోజనానికి వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది.
 
 సాక్షి, చెన్నై:  విరుదునగర్ జిల్లా శివకాశి బాణ సంచా తయారీకి పెట్టింది పేరు. కుట్టి జపాన్‌గా పేరుపొందిన ఈ కేంద్రంలో ప్రతి ఏటా దీపావళి సందర్భంగా భారీ ఎత్తున విక్రయాలు జరుగుతాయి. అలాగే ప్రమాదాలూ అధికమే. కుటీర పరిశ్రమ తరహాలో గ్రామ గ్రామాన సాగుతున్న ఈ బాణసంచా తయారీని అక్కడి ప్రజలు దినదిన గండంగా భావిస్తుంటారు. ఏ సమయం లో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనన్న భయం వెంటాడుతున్నా అదే వృత్తిలో కొనసాగుతున్న వారు అధికం. గత ఏడాది జరిగిన భారీ పేలుడుతో ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. దీంతో ప్రమాదాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రాణ నష్టమూ తగ్గింది. దీపావళి సమీపిస్తుండడంతో బాణసంచా ఉత్పత్తి వేగవంతమైంది. ఈ పరిస్థితుల్లో గురువారం భారీ ప్రమాదం జరగడంతో రాష్ట్రం ఉలిక్కి పడింది. 
 
 శివకాశి సమీపంలోని దురైస్వామిపురంలో కుమరేశన్ అనే వ్యక్తికి చెందిన చిదంబరం ఫైర్ వర్క్స్ పరిశ్రమ ఉంది. ఇక్కడ ఫ్యాన్సీ రకం బాణ సంచా తయారీకి ఉపయోగించే మందుగుండు సామగ్రిని ఆరు బయట ఎండబెట్టారు. గురువారం మధ్యాహ్నం సరిగ్గా 1.20 గంటలకు ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో మందుగుండు సామగ్రి రగిలింది. క్రమంగా మంటలు వ్యాపించాయి. బాణ సంచాలు నిల్వ ఉన్న గదులు, తయారు చేసే గదులకు పాకాయి. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ శబ్దం పది కిలోమీటర్ల దూరం వరకు విన్పించడంతో ఆ పరిసరాల్లో ఉద్రిక్తత బయలుదేరింది. ఈ పరిశ్రమలో పేలుడు ధాటి పక్కనే ఉన్న కృష్ణస్వామి ఫైర్ వర్క్స్‌కు పాకింది. అక్కడ సైతం పేలుళ్లు జరగడంతో ఏ మేరకు ప్రాణ నష్టం సంభంవించనుందోనన్న ఆందోళన బయలుదేరింది. 
 
 సమాచారం అందుకున్న అగ్నిమాపక వాహనాలు పదుల సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. మూడు గంటల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ పేలుళ్లు ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య జరగడం, ఆ సమయం మధ్యాహ్న భోజన విరామం కావడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు బతికి బయటపడ్డారు. సుమారు 80 మందికి పైగా కార్మికులు పేలుడు జరిగిన ప్రదేశానికి కూతవేటు దూరంలో భోజనం చేస్తుండడం, మరికొందరు బయటకు వెళ్లడంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఓ వృద్ధురాలు స్వల్పంగా గాయపడ్డారు. ఈ రెండు పరిశ్రమల్లోని 20 గదులు పూర్తిగా నేలమట్టమయ్యాయి. 
 
 లక్షల్లో ఆస్తి నష్టమైంది. మధ్యాహ్న భోజన విరామ సమయమైనా అందరూ బయటకు వెళ్లారా? లేక ఎవరైనా ఆ శిధిలాల కింద చిక్కుకున్నారా..? అన్న అనుమానాలు బయలుదేరాయి. ఇన్‌స్పెక్టర్ పార్తిబన్ నేతృత్వంలోని బృందం పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతోంది. అక్కడి సిబ్బంది మాత్రం అందరూ బయటకు వచ్చేశామని పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న విరుదునగర్ కలెక్టర్ హరిహరన్ నేతృత్వంలోని అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement