టిక్‌టాక్‌ యాప్‌పై నిషేధం ఎత్తివేత

Madras High Court lifts ban on download of TikTok app in India - Sakshi

సాక్షి, చెన్నై : టిక్‌టాక్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌. కొన్ని పరిమితులతో టిక్‌టాక్‌ మొబైల్‌ యాప్‌పై నిషేధాన్ని మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌ బుధవారం ఎత్తివేసింది. యువత, చిన్నారుల్లో ఆదరణ పొందిన టిక్‌టాక్‌ మొబైల్‌ యాప్‌తో అశ్లీల కంటెంట్‌ వ్యాప్తి అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నెల 3వ తేదీన కోర్టు యాప్‌ను బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన ఈ వీడియో షేరింగ్‌ మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌పై నిషేధం విధించాలని ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్‌ ఎన్‌ కురుబకరన్‌, జస్టిస్‌ ఎస్‌ ఎస్‌ సుందర్‌లతో కూడిన మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.  

టిక్‌టాక్‌ అశ్లీలతను పెంపొందించడమే కాకుండా.. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందంటూ మదురైకి చెందిన సీనియర్‌ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తుకుమార్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని కేంద్రానికి సూచించింది. ఏకపక్షంగా వ్యవహరిస్తూ మద్రాస్‌ హైకోర్టు విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ టిక్‌టాక్‌ సంస్థ సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీనిపై ఇరువాదనలు విన్న సుప్రీంకోర్టు టిక్‌టాక్‌ యాప్‌పై మాద్రాస్‌ హైకోర్టు విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసిన విషయం తెలిసిందే. 

కాగా చైనాలో ఈ యాప్‌ 2016లో ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది వినియోగదారులతో 75 భాషల్లో ఈ అప్లికేషన్‌ టాప్‌ సోషల్‌ యాప్‌లలో ఒకటిగా ట్రెండ్‌ అవుతోంది. ఎలాంటి ప్రత్యేకమైన సెటప్‌ లేకుండా ఫోన్‌ని చేతిలో పట్టుకొని 15 సెకండ్ల వ్యవధితో రెడీమేడ్‌గా ఉండే డైలాగ్స్, పాటలకు తగ్గట్లు పెదాలను సింక్‌ చేస్తూ చాలా వేగంగా షార్ట్‌ వీడియోలు తీయగలగడం దీని ప్రత్యేకత. టిక్‌టాక్‌ని ఎంతమంది వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఉపయోగిస్తున్నారో, అంతకుమించి దుర్వినియోగం కూడా చేస్తున్నారు. 

కొందరు అడల్ట్‌ కంటెంట్‌ని కూడా అప్‌లోడ్‌ చేస్తున్నారు. అశ్లీల దృశ్యాలతో కొందరు యువతీ, యువకులు వీడియోలు తీయడం, మరికొంతమంది వికృత చేష్టలు, పిచ్చి పనులుచేస్తూ ఆ వీడియోలను కూడా పోస్ట్‌ చేయడంతో వివాదం కూడా అవుతోంది. ఇటీవల చెన్నై ముగప్పేర్‌ ప్రాంతానికి చెందిన ఒక బాలిక స్థానికంగా ఓ సంస్థలో నటనలో శిక్షణ పొందుతోంది. టిక్‌టాక్‌ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి 15 ఏళ్ల బాలికకు సినిమా చాన్స్‌ ఇప్పిస్తానని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే రాష్ట్రం సేలం జిల్లా కలెక్టర్‌ రోహిణి ఫొటోలను పెట్టి ఒక టిక్‌ టాక్‌ వీడియో తయారు చేసి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దానిని వైరల్‌ చేశారు. సినిమా పాటలతో లింక్‌ చేసి టిక్‌టాక్‌ యాప్‌లో పోస్ట్‌ చేశారు. వీటిని గమనించిన కలెక్టర్‌ దిగ్భ్రాంతి చెంది, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top