లోక్‌సభ ఎన్నికల ప్రచారం క్రమేణా వేడెక్కుతోంది.
రాయచూరు, న్యూస్‌లైన్ : లోక్‌సభ ఎన్నికల ప్రచారం క్రమేణా వేడెక్కుతోంది. 2-3 రోజులుగా పగటి ఉష్ణోగ్రత పెరుగుతోంది. అయినా అభ్యర్థులు లెక్కచేయకుండా ప్రచారం సాగిస్తున్నారు. జిల్లాలోని 4 తాలూకాలు, అలాగే యాదగిరి జిల్లాలోని 3 తాలూకాలు రాయచూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.
నియోజకవర్గం పరిధి ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థి బివీ.నాయక్, బీజేపీ అభ్యర్థి శివనగౌడనాయక్ నామినేషన్లు వేయకుండానే ప్రచారం ప్రారంభించారు. ఏప్రిల్ 14 లోపు ప్రచారం ముగించాల్సి ఉంది.కాంగ్రెస్ అభ్యర్థి బీవీ.నాయక్ తరఫున కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్ రెండు రోజుల క్రితం దేవదుర్గ, సిరివార, లింగసూగూరులలో భారత నిర్మాణ పాదయాత్రలో పాల్గొని ఉత్సాహం నింపారు. అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి సతీష్ జారకిహొళె బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమై తమపార్టీ అభ్యర్థి గెలుపు కోసం శాయశక్తులా కృషి చేయాలని కోరారు. బీవీ.వినాయక్ కొందరు నేతలతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు.
బీజేపీ అభ్యర్థి శివనగౌడ నాయక్ ఎన్నికలకు చాలా ముందే నియోజకవర్గాన్ని కలియ తిరిగారు. గడచిన మూడు రోజులుగా నగరంలో తిష్ట వేసి పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇంటర్‌నెట్ ప్రచారంపై కూడా మొగ్గు చూపారు. అందులో శివనగౌడనాయక్ ముందున్నారు. ఎండలు ఇంకా పెరిగే సూచనలున్నాయి. దీంతో నియోజకవర్గంలోని 16 లక్షల మంది ఓటర్లను కలుసుకునేందుకు అభ్యర్థులు అన్ని మార్గాలను ఎంచుకుంటున్నారు.