రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థల స్థాయిని పెంచాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన...
- కేబినెట్ నిర్ణయం
- పురసభలుగా ఆరు పట్టణ పంచాయతీలు
- నగర సభలుగా ఎనిమిది పుర సభల స్థాయి పెంపు
- హైకోర్టులో ఇక కన్నడలోనే వ్యవహారాలు
- గంగన్నగారిపల్లిలో ఆశ్రమ పాఠశాల
- చెరకు గిట్టుబాటు ధర నిర్ణయించడానికి నిపుణుల కమిటీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థల స్థాయిని పెంచాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన బుధవారం ఇక్కడ జరిగిన సమావేశంలో సిరుగుప్ప, శిడ్లఘట్ట, హొసకోటె, కనకపుర, నంజనగూడు, ఉల్లాళ, హిరియూరు, ముధోలి పురసభలను నగర సభలుగా స్థాయి పెంచాలని తీర్మానించింది. ముళబాగిలు, కూడచి, కదలగ, హుక్కేరి ముద్గల్, చెన్నగిరి పట్టణ పంచాయతీలను పురసభలుగా స్థాయి పెంచాలని కూడా నిర్ణయించింది. కాగా హైకోర్టులో ఇకమీదట కన్నడ భాషలోనే వ్యవహారాలు సాగేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించింది.
గంగన్నగారిపల్లిలో ఆశ్రమ పాఠశాల
కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలూకాలోని గంగన్న గారి పల్లెలో ఏకలవ్య మోడల్ పాఠశాల లాగా రూ.14.50 కోట్ల అంచనా వ్యయంతో ఆశ్రమ పాఠశాలను నిర్మించడానికి సమావేశంలో పాలనామోదం లభించింది. రామనగరలో జిల్లాస్పత్రిని నిర్మించడానికి ప్రజా పనుల శాఖకు చెందిన మూడు ఎకరాల భూమిని ఆరోగ్య శాఖకు అప్పగించాలని నిర్ణయించింది. కృష్ణ భాగ్య జల నిగమ 2014-15 సంవత్సరానికి రుణాలు, బాండ్ల ద్వారా రూ.వంద కోట్లు సేకరించే నిమిత్తం పూచీకత్తు ఇవ్వాలని తీర్మానించింది.
చెరకు గిట్టుబాటు ధరను నిర్ణయించడానికి ప్రస్తుతం ఉన్న చెరకు నియంత్రణ మండలికి తోడు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ చేసే సిఫార్సులను పరిశీలించి, నిర్ణయాలు తీసుకోవడానికి చక్కెర, సహకార, వ్యవసాయ శాఖల మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయాలని కూడా సమావేశం తీర్మానించింది.