వణుకుతోన్న మలెనాడు

Karnataka People Suffering With Natural disasters - Sakshi

తరచూ ప్రకృతి విపత్తులు  

వరదలు, అంటువ్యాధులు,   భూకంపాలతో జనం బెంబేలు  

ముప్పు పొంచి ఉందని నిపుణుల హెచ్చరిక  

పచ్చని అడవులు, మేఘాలను తాకేఎత్తైన పర్వతాలు, లోతు ఎంతో తెలియని లోయలు, కాఫీ తోటలు.. ఇలా ఎన్నెన్నో అందాలతో మైమరిపించే మలెనాడు ఇప్పుడ ప్రకృతి విపత్తుల గుప్పిట్లోచిక్కుకుంది. మనిషి స్వార్థం ఈ సుందర ప్రాంతం భవితను అగమ్య గోచరంచేసింది. ప్రతి ఏటా వేలాది ఎకరాల్లోఅడవులను కొట్టి తోటలు, ఇళ్లునిర్మించడం, భూ పరిరక్షణనుగాలికొదిలేయడం తదితర చర్యలతో ప్రకృతి మాత క్షోభిస్తోందా అన్నట్లు తరచూ విపత్తులు పలకరిస్తున్నాయి.  
 
సాక్షి, బెంగళూరు: గతేడాది అకాల వర్షాలు, అతివృష్టితో మలెనాడు (హాసన్, శివమొగ్గ, చిక్కమగళూరు, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, కొడగు, ఉడుపి జిల్లాలు) ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అయింది. ఇటీవల కాలంలో మంకీ ఫీవర్‌ రూపంలో మరోసారి ముప్పు వాటిల్లింది. ఇక ఇదే క్రమంలో గత రెండు, మూడు రోజుల నుంచి మలేనాడు ప్రాంతంలోని శివమొగ్గ జిల్లా వాసులను భూకంపం భయభ్రాంతులకు గురిచేస్తోంది. గత రెండు రోజుల క్రితం శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి–హోసనగర తాలూకా సరిహద్దు భాగాల్లో భూమి కంపిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. 

సోమవారం మళ్లీ ప్రకంపనలు  
ఈ నెల 2న అర్ధరాత్రి 1.33 గంటలకు హోసనగర, తీర్థహళ్లి తాలూకా సరిహద్దులో స్వల్పంగా భూమి కంపించిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం మరోసారి భూమి కంపించింది. పశ్చిమ ఘాట్‌ ప్రాంతంలో ఎదురవుతున్న ప్రమాదాలకు ఇవి ముందస్తు హెచ్చరికలగా భావించవచ్చనని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తీర్థహల్లి తాలూకాలో మాణి జలశయం సమీపంలో విఠల నగర వద్ద భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. 

భారీ భూకంపమే వస్తే?  
విఠల నగర ప్రాంతంలోనే వారాహి, మాణి, సావేహళ్లు, శరావతి జలాశయాలు ఉన్నాయి. ఈ క్రమంలో భూకంపం తీవ్రత పెరిగితే నష్టం అంచనాలకు అందకపోవచ్చు. విఠల నగరలో మూడో సారి భూకంపం రావడం గమనార్హం. గతంలో 1843లో ఏప్రిల్‌ 1న రిక్టర్‌ స్కేల్‌పై 5 స్థాయిలో, 1975లో మే 12న 4.7 స్థాయిలో భూకంపాలు సంభవించాయి. 

2010లోనే నిపుణుల హెచ్చరిక  
పశ్చిమ ఘాట్‌ పరిధిలో శరావతి లోయ  సున్నిత ప్రాంతం. ఇక్కడ నేల పొరలు పొరలుగా నిర్మితమైంది. దీంతో భూకంపం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక సంఖ్యలో జలాశయాలు ఉండడం, మనిషి పట్టణీకరణ కోసం అడవులను నాశనం చేయడం వల్ల ప్రకృతి కోపానికి కారణమవుతోందని 2010లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందింది. భారతీయ విజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తలు శరావతి లోయలో అధ్యయనం చేసి భూకంపం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని నివేదిక సమర్పించారు. ఈ ప్రాంతంలోని అడవులను నాశనం చేయడంతో పాటు, చాలా ఆనకట్టలు అపాయకర స్థితిలో ఉన్నాయని హెచ్చరించారు. భూమి లోపల ఫలకాలు స్థానభ్రంశం చెందే అవకాశం ఉందని, వాటి వల్ల భూకంపాలు సంభవిస్తాయని 2010లో హెచ్చరికలు పంపారు. అలాగే అగ్నిప్రమాదాలు కూడా జరుగుతాయని సూచించారు. ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చనే హెచ్చరికలను నివేదిక ద్వారా ప్రభుత్వానికి పంపారు.  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top