
యాక్షన్ థ్రిల్లర్‌కు రెడీ
వైవిధ్యానికి మారు పేరు కమల్ హాసన్. నటనలోనే కాదు ఆయన ఎంచుకునే కథల్లోనూ, కథనాల్లోనూ
వైవిధ్యానికి మారు పేరు కమల్ హాసన్. నటనలోనే కాదు ఆయన ఎంచుకునే కథల్లోనూ, కథనాల్లోనూ విభిన్నత్వం తొణికిసలాడుతుంది. అందుకే సకలకళావల్లభుడి చిత్రాలు జయాపజయాలకు అతీతం అంటారు. కమల్ నటించిన విశ్వరూపం, పాపనాశం, ఉత్తమవిలన్ వంటి మూడు చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. వీటిలో ఉత్తమ విలన్ చిత్రం మే నెల 1న తెరపైకి రానుంది. విశ్వనాయకుడు తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం.
ఆయనీసారి యాక్షన్ థ్రిల్లర్‌కు మారనున్నారన్నది విశేషాంశం. ఈ చిత్రానికి సంబంధించిన గీతాల సంగీతరూపకల్పన కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు జిబ్రాన్ స్పష్టం చేశారు. కమల్ మూడు చిత్రాలకు వరుసగా పని చేసిన ఈయన ఈ తాజా చిత్రానికి కూడా సంగీతాన్ని అందించడం విశేషం. కమల్ తదుపరి చిత్రం యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని జిబ్రాన్ తెలిపారు. చిత్ర షూటింగ్ మాల్‌దీవుల్లో నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ చిత్రంలో హైఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు చోటుచేసుకుంటాయని తెలిపారు.