జైన్ దేవాలయంలో దొంగలు పడ్డారు. సెక్యూరిటీ గార్డులపై మత్తు మందు చల్లి భారీ మొత్తంలో లూటీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే...
బెంగళూరు, న్యూస్‌లైన్ : జైన్ దేవాలయంలో దొంగలు పడ్డారు. సెక్యూరిటీ గార్డులపై మత్తు మందు చల్లి భారీ మొత్తంలో లూటీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... బెంగళూరులోని మెజిస్టిక్ సమీపంలోని అక్కిపేట మెయిన్ రోడ్డులోని ఓబయ్య లే ఔట్‌లో ప్రఖ్యాతి గాంచిన జైన మందిరం ఉంది. ఇక్కడ అమూల్యమైన పురాతన విగ్రహాలను ఏర్పాటు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో ఐదు హుండీలు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఆరు సీసీ కెమెరాలతో పాటు ఐదుగురు గార్డులను కూడా ఏర్పాటు చేశారు.
శనివారం రాత్రి పూజల అనంతరం ఆలయానికి తాళం వేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు అక్కడకు చేరుకుని సెక్యూరిటీ గార్డులపై మత్తుమందు చల్లి అచేతనులను చేశారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం కిటికి ఊచలను కత్తిరించి లోపలకు చొరబడ్డారు. ఆలయంలోని పురాతన పంచలోహ విగ్రహాలు, వస్తువులు, పూజా సామగ్రి, బంగారు నగలు, ఐదు హుండీల్లోని నగదు లూటీ చేసి ఉడాయించారు.
ఆదివారం ఉదయం పూజలు చేసేందుకు ఆలయానికి చేరుకున్న అర్చకుడు విషయాన్ని గుర్తించి సమాచారం అందివ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మొత్తం రూ. 30 లక్షల విలువైన ఆభరణాలు, రూ. మూడు లక్షలకు పైగా లూటీ అయినట్లు ఆలయ నిర్వాహాకులు తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి, స్థానిక ఎమ్మెల్యే దినేష్ గుండూరావు, పోలీస్ ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిశీలించారు. వేలి ముద్రల నిపుణులు, స్నిప్పర్ డాగ్ బృందం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది.