ప్రియురాలి కోసం ఆత్మహత్యకు యత్నించి, తన తల్లిదండ్రులకే ద్రోహం తలపెట్టేలా వ్యవహరించానని కన్నడ సినీ నటుడు హుచ్చ వెంకట్ పేర్కొన్నారు.
శివాజీనగర(కర్నాటక): ప్రియురాలి కోసం ఆత్మహత్యకు యత్నించి, తన తల్లిదండ్రులకే ద్రోహం తలపెట్టే లా వ్యవహరించి చాలా తప్పు చేశానని, ఇందుకు సమాజాన్ని క్షమాపణ కోరుతున్నానని కన్నడ సినీ నటుడు హుచ్చ వెంకట్ పేర్కొన్నారు. తనను ప్రేమించిన సినీ నటి రచనా వివాహానికి తిరస్కరించటంతో ఆత్మహత్యకు యత్నించినట్లు వెంకట్ మంగళవారం మీడియా ముందు స్పష్టం చేశారు. నటి రచనతో ఏర్పడిన ప్రేమ వ్యవహారాన్ని వెంకట్ వివరించారు. రచన ప్రోద్భలంతోనే ఆమె ప్రేమలో పడ్డానని చెప్పారు.
ఓ సినిమా షూటింగ్ సందర్భంలో తనతో పరిచయం పెంచుకోవడంతో పాటు సెల్ఫీ తీసుకొనటం ద్వారా రచన స్నేహం చేసిందని పేర్కొన్నారు. అలా ప్రేమ చిగురించిందని, అయితే తాను రాజకీయ ప్రవేశం చేసి కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన తరువాత రెండు సంవత్సరాలకు వివాహం చేసుకొంటానని తేల్చిచెప్పినట్లు వెంకట్ వివరించారు. ఆ తరువాత తాను వివాహం చేసుకోవాలని అడగటంతో తమ ఇంట్లోవారు ఒప్పుకోవటం లేదని రచన అన్నారన్నారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన తాను ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు వెంకట్ తెలిపారు.