హైఅలర్ట్ | High Alert | Sakshi
Sakshi News home page

హైఅలర్ట్

Sep 28 2014 3:00 AM | Updated on Sep 2 2017 2:01 PM

హైఅలర్ట్

హైఅలర్ట్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసులో శనివారం ఇక్కడి ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో బెంగళూరు నగర శివార్లలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

  • పరప్పన అగ్రహార జైలు ఎదుట అన్నాడీఎంకే కార్యకర్తల ఆందోళన
  •  పోలీసుల లాఠీచార్‌‌
  •  వాహనాలపై రాళ్లు రువ్విన అభిమానులు  
  •  దాదాపు ఐదు వందల మంది అరెస్ట్
  •  తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన బస్ సర్వీసులు
  •  పరిస్థితిని సమీక్షించిన నగర సీపీ ఎం.ఎన్. రెడ్డి
  • బెంగళూరు : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసులో శనివారం ఇక్కడి ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో బెంగళూరు నగర శివార్లలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రత్యేక కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నేపథ్యంలో అన్నా డీఎంకు చెందిన వేలాది మంది కార్యకర్తలు తమిళనాడు నుంచి బెంగళూరు చేరుకున్నారు. దీంతో పోలీసులు అసాధరణ భద్రత ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో అన్నాడీఎంకే అభిమానులు మూడు రోజుల క్రితమే బెంగళూరు చేరుకున్నారు.

    ఈ మేరకు శనివారం అన్నా డీఎంకే కార్యకర్తల ఆందోళనలతో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైలు పరిసరాలు అట్టుడికాయి. ఇక్కడి జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు..తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసుపై తీర్పు ఇచ్చింది. జయకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించినట్లు న్యాయస్థానం తీర్పు వెలువరించిన వెంటనే...అప్పటికే అక్కడకు వందలాదిగా చేరుకున్న అన్నా డీఎంకే కార్యకర్తలు నిర్వేదానికి గురయ్యారు. అన్నా డీఎంకే శాసన సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

    ఓ దశలో కార్యకర్తలు బ్యారికేడ్లను దాటుకొని కోర్టు ఆవరణలోకి చొచ్చుకుని వెళ్లడానికి ప్రయత్నించారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రెచ్చిపోయిన కార్యకర్తలు చుట్టు పక్కల వెళ్తున్న వాహనాలపైకి రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు ఆందోళన కారులను వెంటాడి తరితరిమి కొట్టారు. దాదాపు 500 మందికి పైగా కార్యకర్తలను అరెస్టు చేసి బీఎంటీసీ బస్సుల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరో వైపు జయలలితకు మద్దతుగా హొసూరు రోడ్డు, హొసరోడ్డు, హొసరోడ్డు జంక్షన్. పరప్పన అగ్రహార, అత్తిబెలే, చందాపుర తదతర చోట్ల అభిమానులు, అన్నా డీఎంకే కార్యకర్తలు బైఠాయించి ఆందోళనకు దిగారు. రోడ్లపై టైర్లు వేసి నిప్పంటించారు. డీఎంకే అధినేత కరుణానిధికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆయన దిష్టిబొమ్మలు దహనం చేశారు.  
     
    ఐదు కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్

    జయలలిత అక్రమాస్తులపై తీర్పు నేపథ్యంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిన పరప్పన జైలు పరిసర ప్రాంతంలో పోలీసుశాఖ శనివారం ఉదయమే కిలోమీటర్ పరిధిలో 144 సెక్షన్ విధించింది. జయలలిత దోషి అని కోర్టు ప్రకటించిన వెంటనే కోర్టు పరిసర ప్రాంతాలలో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని సమీక్షించిన నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి 144 సెక్షన్‌ను ఐదు కిలోమీటర్లకు పొడిగించారు. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. పరప్పన అగ్రహార జైలు పరిసరాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్‌రూం సిబ్బంది పరిస్థితిని సమీక్షించారు.
     
    కర్ణాటక- తమిళనాడు సరిహద్దులో పోలీసు భద్రత

    జయలలిత అక్రమాస్తులపై కోర్టు తీర్పు నేపథ్యంలో కర్ణాటక- తమిళనాడు సరిహద్దులోని అత్తిబెలే ప్రాంతంలో పోలీసులు భద్రతను పెంచారు. శనివారం వేకువ జామునుంచి అన్నా డీఎంకే కార్యకర్తలు మకాం వేశారు. వారు బెంగళూరు నగర శివార్లలోకి రావడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులు అక్కడే మకాం వేసి పరిస్థితి చేయిదాటకుండా చర్యలు తీసుకున్నారు.
     
    ఇరు రాష్ట్రాల మధ్య బస్సుల సర్వీసులు రద్దు

    జయలలిత కేసు తీర్పు నేపథ్యంలో అల్లర్లు చెలరేగుతాయని భావించిన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు రెండు ప్రాంతాల మధ్య బస్ సర్వీసులు రద్దు చేశారు. తమిళనాడుకు వెళ్లే కేఎస్‌ఆర్‌టీ బస్సు సర్వీసులు నగరంలోనే నిలిపివేశారు. అదేవిధంగా బెంగళూరుకు రావాల్సిన బస్సులను తమిళనాడులోనే నిలిపివేశారు.   
     
    బెంగళూరు గట్టి బందోబస్తు

    బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాలలో తమిళ సోదరులు నివాసం ఉంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అలజడులు, ఆందోళనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
    మఫ్టీ పోలీసులు  రహస్యంగా వీడియో చిత్రీకరణ చేపట్టారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement