వేసవి దృష్ట్యా బళ్లారిలో మట్టి కుండలు, కూజాల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి.
జోరందుకున్న మట్టికుండల విక్రయాలు
ఆకట్టుకుంటున్న రాజస్థాన్ మట్టి కుండలు, కూజాలు
బళ్లారి అర్బన్ : వేసవి దృష్ట్యా బళ్లారిలో మట్టి కుండలు, కూజాల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే రాజస్థాన్ జోధ్‌పూర్‌కు చెందిన బల్‌దేవ్‌జీ, బన్సీలాల్ వ్యాపారులు రాజస్థాన్ నుంచి లారీల ద్వారా వివిధ రకాల మట్టి కుండలను తీసుకువచ్చి విక్రయాలు చేస్తున్నారు. స్థానిక ఎస్పీ సర్కిల్‌లోని జైల్‌గోడ పక్కన బల్‌దేవ్ ఇప్పటికే రెండు లోడ్ల మట్టి కుండలను విక్రయించారు.
నగరంలో వివిధ ప్రాంతాల్లోని కుమ్మరి వ్యాపారులు తయారు చేసిన కుండలు, కూజాలతో పాటు వడ్రబండ, కుమ్మరవీధిలో, కౌల్‌బజార్ కుంబర వీధిలలో మట్టి కుండలు విక్రయిస్తున్నారు. మట్టి కుండలు రూ.100ల నుంచి రూ.350ల వరకు సైజ్‌ను బట్టి స్టాండ్‌తో పాటు అమ్మకాలు చేపట్టారు. నగరంలో ఎండలు అధికం కావడంతో చల్లటి నీటి కోసం అలమటిస్తున్నారు. ఫ్రిజ్ నీరు కన్నా మట్టికుండలోని నీరు శ్రేష్టమని, ఉత్తమ ఆరోగ్యానికి మట్టి కుండలు మేలు కావడంతో ఈ వ్యాపారం జోరుగా సాగుతోందన్నారు.