ఆ ఫైల్ రాలేదంటే కుదరదు.. | files bifurcation at new districts in telangana | Sakshi
Sakshi News home page

ఆ ఫైల్ రాలేదంటే కుదరదు..

Sep 13 2016 12:53 PM | Updated on Oct 2 2018 4:01 PM

కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాల్లో దసరా పండగ నుంచే పాలన ప్రారంభించాలని ప్రభుత్వం ముందుకెళుతోంది.

  ఆన్‌లైన్‌లో జిల్లా కార్యాలయాల ఫైళ్ల వివరాలు క్రోడీకరణ
  నిమగ్నమైన అన్ని శాఖల అధికారులు
  విభజనకు గురయ్యే డివిజన్లు, మండల కార్యాలయాల్లోనూ ఫైళ్ల విభజన 
 
 
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాల్లో దసరా పండగ నుంచే పాలన ప్రారంభించాలని ప్రభుత్వం ముందుకెళుతోంది. మరి కొత్త జిల్లాల్లో పరిపాలన షురూ కావాలంటే ఫైల్స్ తప్పనిసరి., ప్రజలు వివిధ పనుల నిమిత్తం కొత్త జిల్లాల్లోని కార్యాలయాలకు వెళితే ఆ అంశానికి సంబంధించి ఫైలు ఇంకా ఇక్కడికి రాలేదు.. ఆ ఫైల్ దొరకడం లేదు.. ఇలా అధికారుల నుంచి సమాధానం వచ్చే అవకాశాలున్నాయి.. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఫైళ్ల విభజన, కంప్యూటరీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఆయా శాఖలకు సంబంధించి ఏ ఫైల్ ఎక్కడుంది.? అది ఏ ప్రాంతానికి సంబంధించినది.? కరెంట్ ఫైల్స్ ఏవీ.? క్లోజ్డ్ ఫైల్స్ ఏవీ.? ఆయా ఫైళ్ల సబ్జెక్టు ఏందీ.. ఇలా పాలనకు అవసరమైన ఫైళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో క్రోడీకరించే ప్రక్రియలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఆయా కార్యాలయాల్లో సర్క్యులేషన్‌లో ఉన్న ఫైల్ ఏవీ..? రికార్డుల కోసం భద్రపరచాల్సిన పాత ఫైళ్ల వివరాలను ఇలా అన్నింటి సమాచారాన్ని సేకరిస్తున్నారు. వీటన్నింటిని ఆన్‌లైన్‌లో క్రోడీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో అన్ని శాఖల్లో ఈ ప్రక్రియ ఊపందుకుంది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వివరాలను క్రోడీకరిస్తున్నారు. ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులకు ఐడీ, పాస్‌వర్డ్ జారీ చేశారు. ఫైల్ నెం, సబ్జెక్టు, సంవత్సరం, వంటి అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్ ఉన్నతాధికారులు ఈ ఫైళ్ల కంప్యూటరీకరణ ప్రక్రియ ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనే రెవెన్యూ శాఖలో అత్యధికంగా ఫైళ్లుంటాయి. ఈ రెవెన్యూ, సర్వే, ల్యాండ్ రికార్డు శాఖల్లో కీలకమైన భూములకు సంబంధించిన ఫైళ్లు ఉండడంతో అధికారులు ఈ శాఖలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.  
 
విభజనకు గురయ్యే డివిజన్లు, మండలాల్లోనూ..
కేవలం జిల్లా స్థాయి కార్యాలయాలతోపాటు విభజనకు గురయ్యే రెవెన్యూ డివిజన్లు, మండలాల్లోనూ ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. రెండు మూడు రోజుల్లో డివిజన్ స్థాయి కార్యాలయాల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని కలెక్టరేట్‌కు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో బెల్లంపల్లి, భైంసా రెవెన్యూ డివిజన్లుగా ఏర్పడనున్నాయి. దీంతో ఈ డివిజన్లకు సంబంధించిన కార్యాలయాల్లోనూ ఫైళ్ల విభజన అనివార్యమవుతోంది. అలాగే ఉట్నూర్, ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్లలోని కొన్ని మండలాల పరిధిలో మార్పులు, చేర్పూలు జరుగుతున్నాయి. దీంతో ఈ డివిజన్లలోనూ ఫైళ్ల విభజన చేపట్టనున్నారు. కొత్త మండలాలు ఏర్పడుతున్న మండల కార్యాలయాల్లోనూ ఈ ఫైళ్ల విభజన చేపట్టాల్సిన అవసరం తప్పనిసరిగా మారింది. ముందుగా ఆదిలాబాద్ మండలంలో మావలను, మంచిర్యాల మండలంలో నస్పూర్‌ను కొత్త మండలాలుగా ఏర్పాటు చేయాలని భావించారు. ఈ మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశాక మరో ఏడు కొత్త మండలాలు తెరపైకి వచ్చాయి. ఆదిలాబాద్ రూరల్, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట్, నార్నూర్ మండలం గాదిగూడ, ఖనాపూర్ మండలం పెంబీ, ముథోల్ మండలం బాసర, నిర్మల్ మండలం సోన్ ఇలా ఏడు కొత్త మండలాలకు జిల్లా ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపారు. దీంతో కొత్తగా ఏర్పడనున్న ఈ మండలాల్లోని అన్ని కార్యాలయాల్లోనూ ఫైళ్ల విభజన ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement